Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోట మాట రాని పంచ్ వేసిన రేవంత్

By:  Tupaki Desk   |   30 May 2019 5:17 AM GMT
కేటీఆర్ నోట మాట రాని పంచ్ వేసిన రేవంత్
X
అన్నిసార్లు కాలం మ‌న వైపే ఉండ‌దు. ఆ విష‌యాన్ని గుర్తించి.. తెలివి ఎరిగి ప్ర‌వ‌ర్తిస్తే ఫ‌ర్లేదు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఇమేజ్ పోవ‌ట‌మే కాదు.. కొన్నిసార్లు అభాసుపాలు కావ‌టం జ‌రుగుతుంది. తాజాగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌రిస్థితి ఇలానే ఉంది.

గ‌తంలో ఆయ‌న నోటి నుంచి మాట వ‌చ్చిందంటే.. గురి త‌ప్ప‌ని బాణంలా ఉండేది. ఈ మ‌ధ్య‌న ఆయ‌న ఒత్తిడికి గురి అవుతున్నారో.. గ‌తాన్ని పెద్ద‌గా గుర్తుంచుకోవ‌టం లేదో కానీ.. త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఓడిన ప్ర‌ముఖులు మ‌ళ్లీ లోక్ స‌భ బ‌రిలో నిల‌వ‌టాన్ని ఎట‌కారం చేస్తూ.. చెల్ల‌ని నాణెంగా అభివ‌ర్ణించారు. ఇప్పుడా చెల్ల‌ని నాణెలే త‌మ అభ్య‌ర్థుల్ని ఓడించిన తీరు ఒక బాధ అయితే.. త‌న సోద‌రి క‌విత దారుణ ఓట‌మి కూడా ఇప్పుడాయ‌న స‌మాధానం చెప్ప‌లేన‌ట్లుగా మారింది.

తాజాగా త‌మ‌కు ఎదురైన ఓట‌మిని హుందాగా ఒప్పుకొని ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ.. అందుకు భిన్నంగా కింద ప‌డినా పైచేయి త‌మ‌దే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేటీఆర్.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ఆభాసుపాల‌య్యే ప‌రిస్థితిని తెచ్చుకున్నారు. తాము ఓట‌మి చెందిన స్థానాల్లో స్వ‌ల్ప అధిక్య‌త‌ల‌తో ప్ర‌త్య‌ర్థులు గెలిచార‌ని.. వారిది గెలుపే కాద‌ని తేల్చారు. ఇక‌.. మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానంలో గెలిచిన రేవంత్ గెలుపును త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారు.

స్వ‌ల్ప మెజార్టీతో గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? అంటూ రేవంత్ ను ఎద్దేవా చేశారు. దీనికి ప్ర‌తిగా రేవంత్ ఇచ్చిన పంచ్ కేటీఆర్ నోట మాట రాకుండా చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. మ‌ల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడే ముందు 2009లో సిరిసిల్ల‌లో ప‌రిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలంటూ పంచ్ విసిరారు రేవంత్‌. స్వ‌తంత్ర అభ్య‌ర్థిపై కేవ‌లం 171 ఓట్ల తేడాతో కేటీఆర్ గెలిచార‌ని.. అది కూడా పోస్ట‌ల్ బ్యాలెట్ల‌తో బ‌య‌ట‌ప‌డిన వైనాన్ని ఆయ‌న గుర్తు చేశారు. రేవంత్ కు వ‌చ్చిన తాజా మెజార్టీతో పోలిస్తే.. 2009లో కేటీఆర్ కు వ‌చ్చిన స్వ‌ల్ప అధిక్య‌త అస్స‌లు లెక్క‌లోకి తీసుకోవాల్సింది కాదు. అందుకే అంటారు.. ఒక‌రిని విమ‌ర్శించే వేళ‌లో.. గ‌తాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాల‌ని.. లేకుంటే ఇలాంటివి పంచ్ లు త‌ప్ప‌వు.