Begin typing your search above and press return to search.

కేసీఆర్ దోపిడికి ప‌వ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌

By:  Tupaki Desk   |   2 Jan 2018 8:48 AM GMT
కేసీఆర్ దోపిడికి ప‌వ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ను జ‌న‌సేన పార్టీ ర‌థ‌సార‌థి ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌వ‌డంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్‌ ను క‌లిసిన మ‌రుస‌టిరోజే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇటు ప‌వ‌న్ అటు కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. కొత్త సంవత్సరంలో కేసీఆర్ మాయ మాటలకు తేరలేపారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాయమాటల్లో పవన్ పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల మత్తులో ప్రజలను ముంచేందుకు సహక‌రించే విధంగా పవన్ మాట్లాడారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో విద్యుత్ విష‌యంలో నాటి పరిస్థితి ప్రకారం అప్ప‌టి ముఖ్య‌మంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది వాస్తవమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. అది గమనించి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ విద్యుత్ ను వినియోగ ప్రాతిపాదికన‌ విభజించార‌ని తెలిపారు. తెలంగాణకు 54శాతం విద్యుత్ కేటాయించి.... 46 శాతం ఏపీకి కేటాయించేలా సోనియాగాంధీ చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లిలో 600 మెగావాట్లు - జైపూర్‌ లో 1200 మెగావాట్లు - మహబూబ్ నగర్ 240 మెగావాట్ ప్రాజెక్ట్ లు నాడు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించారని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. కాంగ్రెస్ నాడు ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టుల‌ వల్లనే నేడు మిగులు విద్యుత్ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

దీంతో పాటుగా ఉదయ్ ఫథకం ద్వారా కూడా కేంద్రం రాష్ట్రానికి విద్యుత్ ఇస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు విద్యుత్ పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నార‌ని రేవంత్ మండిప‌డ్డారు. మూత పడుతున్న విద్యుత్ కంపెనీలకు కేసీఆర్ ప్రాణం పోస్తున్నార‌ని ఆరోపించారు. దివాళా తీసిన విద్యుత్ కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారని విమ‌ర్శించారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. 24గంటల విద్యుత్ ను 56లక్షల మంది రైతులు కోరుకోలేదని...ఉదయం పూట 9గంటలు ఇస్తే చాలు అని రైతులు కోరుకుంటున్నారని ఆయ‌న తెలిపారు. రాత్రి పూట విద్యుత్ ఇవ్వడం ద్వారా ఎవరికి లాభమ‌ని రేవంత్ ప్ర‌శ్నించారు.

పవన్ క‌ళ్యాణ్‌ నిజాలు తెలుసుకోవాలంటే...విద్యుత్ జేఏసీ నేత‌ రాసిన పుస్తకం చదువాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. పవన్‌ కు రఘు రాసిన పుస్తకాన్ని పంపుతాన‌ని వెల్ల‌డించారు. విద్యుత్ వెనక దోపిడీని పవన్ గుర్తించాలని అన్నారు. కేసీఆర్ దోపిడీకి పవన్ కళ్యాణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ట్విట్టర్లో పవన్ క‌ళ్యాణ్‌ ను అపరిచితుడు అని మంత్రి కేటీఆర్ అన్న‌ సంగతి పవన్ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మూడేళ్ళలో అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని చెప్పారు. కేసీఆర్ కు సవాల్ విసురుతున్నాన‌ని పేర్కొంటూ సీఎం కేసీఆర్ స‌హా మంత్రులు ఎవరు వ‌చ్చిన తాను రెడీ అని ప్ర‌క‌టించారు.

తెలంగాణ సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఎంత మంది మహిళలు - గిరిజనులు - రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో పవన్‌ కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. నలబై నెలల్లో నాలుగు సార్లు సచివాలయం రాని కేసీఆర్‌ ను ఏ విష‌యంలో...ఏం చూసి అద్భుతంగా పాల‌న ఉంద‌ని పవన్ మాట్లాడారంటూ రేవంత్ నిల‌దీశారు. తెలంగాణాలో పరిస్థితిపై పవన్ కు అవగాహన లేనట్లుంద‌ని ఎద్దేవా చేశారు. బర్రెలు....గొర్రెలు..సిల్క్ స్మిత చీరలు కేసీఆర్‌ పంచుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు చెప్పాలని....దోచుకుంటున్న కేసీఆర్ ను పవన్ సమర్తించడం స‌రికాద‌న్నారు. అమరవీరుల బలిదానాలను అవమానించిన కేసీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఎలా సమర్థిస్తారని ప్ర‌శ్నించారు. పవన కళ్యాణ్ ఒక వైపు కాకుండా రెండో వైపు చూస్తే అసలు తెలంగాణ కనిపిస్తుందని ఆయ‌న అన్నారు. బంగారు తెలంగాణాలో బంగారం లేదని...,తెలంగాణ బొందల గడ్డగా మారుతోంద‌ని రేవంత్ అన్నారు. ప‌వన్ పై త‌మకు విశ్వాసం ఉందని...లాలూచీకి పవన్ లొంగిపోతారని తాను అనుకోనని రేవంత్ రెడ్డి తెలిపారు.