Begin typing your search above and press return to search.

‘జీడీపీ’ పెంచడం అంటే.. రేవంత్‌రెడ్డి సెటైర్ అదుర్స్!

By:  Tupaki Desk   |   24 Oct 2021 12:30 PM GMT
‘జీడీపీ’ పెంచడం అంటే.. రేవంత్‌రెడ్డి సెటైర్ అదుర్స్!
X
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్టైల్ ఇతర రాజకీయ నాయకులంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రత్యర్థులపై ఎంత ఆగ్రహంగా మాట్లాడుతారో అంతే చతురత, హస్యంతో మాట్లాడుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తారు. అందువల్లే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లను పక్కకు పెట్టి రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించారు. అయితే ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత హుజురాబాద్‌కు ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యువకుడైన బల్మారి వెంకట్‌ను అభ్యర్థిగా నిలబెట్టారు. కొన్ని రోజులుగా రేవంత్ హుజురాబాద్‌లో మకాం వేశారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ.. ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘జీడీపీ’కి కొత్త అర్థాన్ని చెప్పారు. ‘‘గత ఏడు ఏళ్లలో నుండీ బీజేపీ ప్రభుత్వం జీడీపీ పెంచుతాం.. పెంచుతాం అంటే నేను ఏదో అనుకున్నాను. కానీ జీడీపీ పెంచడం అంటే జీ అంటే గ్యాస్, డీ అంటీ డీజిల్, పీ అంటే పెట్రోల్ పెంచడం అని అర్ధం ఇప్పుడే తెలిసింది. జీడీపీ పెంచడం గ్యాస్ డీజీల్ పెట్రోల్ పెంచడం అని ఈ దేశ ప్రజలు ఇప్పుడే అర్ధం చేసుకుంటున్నారు’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

అదేవిధంగా ఏపీ రాజధాని అమరావతి గురించి కూడా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక చేశారు. ‘‘రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అప్పుడు రాజధాని కోసం ప్రధాని ‘మనీ’ తెచ్చాడు అని అందరూ అనుకున్నారు. మనీ అంటే మట్టి, నీరు అర్ధం’’ అని రేవంత్‌రెడ్డి సెటైర్ వేశారు.

టీఆర్ఎస్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర పరువును దిగజారుస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని, నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచారని ధ్వజమెత్తారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెబుతారని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.