Begin typing your search above and press return to search.

అతడి ఊరును కేసీఆర్ కర్ణాటకలో కలిపేవారట

By:  Tupaki Desk   |   3 Jan 2017 10:30 PM GMT
అతడి ఊరును కేసీఆర్ కర్ణాటకలో కలిపేవారట
X
మాటల్ని చురకత్తుల్లా సంధించే తెలంగాణ నేతల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి చటుక్కున గుర్తుకు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్ధాటికి ధీటుగా రేవంత్ రెడ్డి మాటలు ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపించే వాదనకు కౌంటర్ అటాక్ ఇవ్వటంలో రేవంత్ అందె వేసిన చేయిగా చెప్పొచ్చు. ఓటుకు నోటు ఎపిసోడ్ లో కెమేరా కంటికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది కానీ.. కేసీఆర్ కు ధీటుగా రేవంత్ రెడ్డిని పలువురు అభివర్ణించేవారు.

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన వేళ.. విలేకరులు ఆయన్ను చుట్టు ముట్టి సరదాగా మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఈ సమయంలో ఒక విలేకరికి పెద్ద డౌట్ వచ్చింది. ఇంతకీ మీ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందని ప్రశ్నించారు. అంతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ రేంజ్లో ఎటకారంచేసుకోవటం మొదలెట్టారు రేవంత్ రెడ్డి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్ నియోజకవర్గం ప్రస్తుతం.. మహబూబ్ నగర్.. నాగర్ కర్నూల్.. వికారాబాద్ జిల్లాల్లో ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇంకా నయం.. నాకు సొంతిల్లున్న కొడంగల్ ను కర్నాటకలో కలిపే వారేమో. కర్ణాటక కానీ ఒప్పుకొని ఉంటే కేసీఆర్ ఆ పని కూడా చేసి ఉండేవారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. ఎవరి నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందన్న విషయం అర్థం కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన తెలుగు తమ్ముళ్ల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే పశ్చాత్తాప పడుతున్నారని.. ఏదో ఒక రోజు ప్లేట్ ఫిరాయించినా ఆశ్చర్యం లేదన్న వాదనను వినిపించారు. సమీప దూరంలో కేసీఆర్ కు తిరుగులేదన్న భావన వ్యక్తమవుతున్న వేళ.. రేవంత్ భావిస్తున్నట్లు తమ్ముళ్లు ప్లేట్ ఫిరాయించాల్సిన ఆగత్యం ఉందంటారా?