Begin typing your search above and press return to search.

కవిత పిలుపు రేవంత్ కు అలా అర్థమైందా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 4:29 PM GMT
కవిత పిలుపు రేవంత్ కు అలా అర్థమైందా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎంత మాటల మనిషో ఆయన చేసే వ్యాఖ్యలతోనే అర్థమవుతుంది. ఘాటైన వ్యాఖ్యలు చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో ఎంత చురుకు ఉంటుందో.. ఇంచుమించే అంతే చురుకు రేవంత్ మాటల్లో కనిపిస్తుంటుంది. విషయం ఏదైనా సరే.. కన్వీన్సింగ్ చెప్పేసి.. ఔరా.. ఇలా కూడా ఆలోచించొచ్చా అన్నట్లు మాట్లాడే నేర్పరితనం రేవంత్ సొంతం.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునివ్వటం.. పలువురు సెలబ్రిటీలు స్పందించటం లాంటి జరిగిపాయాయి. ఓపక్క రైతుల ఆత్మహత్యల విషయంలో మీడియాకు.. ప్రభుత్వానికి మధ్య లెక్కల విషయం పొంతన కుదరకపోవటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్యపై కేసీఆర్ చెబుతున్న దానికి.. బయట వస్తున్న లెక్కకు అస్సలు పొంతన ఉండని పరిస్థితి.

మరోవైపు.. ఆత్మహత్యలు పెద్దగా లేవన్నట్లుగా కేసీఆర్ సర్కారు చెబుతుంటే.. మరోవైపు ఆయన కుమార్తె రైతుల్ని ఆదుకోవాలని పిలుపునివ్వటం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించినా.. చేస్తున్నది మంచి పని కావటంతో ఎవరూ విమర్శించింది. లేదు. అందరికి కవిత పిలుపును పాజిటివ్ గా చూస్తే.. రేవంత్ మాత్రం తనదైన శైలిలో చూడటం గమనార్హం.

తాజాగా.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని ఆదుకునే విషయంలో కవిత ఇచ్చిన పిలుపుపై రియాక్ట్ అయిన రేవంత్ ఎలా ఫైర్ అయ్యారో ఆయన మాటల్లో వింటేనే బాగుంటుంది. ఆయన ఏమన్నారంటే.. ‘‘సమాజంలో ఎవరైనా ఆడబిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతుందంటే దాని అర్థం ఆమె తండ్రి.. చేతకాని వాడు.. తాగుబోతు.. కుటుంబాన్ని పట్టించుకోని వాడని అర్థం. ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకొని రోడ్డు మీదికెక్కిందంటే దాని అర్థం ఏమిటి? తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి’’ అంటూ ఫైర్ అయ్యారు. ఎంపీ కవిత పిలుపునకు తనదైన శైలిలో భాష్యం చెప్పిన రేవంత్ మాటలకు టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..?