Begin typing your search above and press return to search.

ఈటలను కేసీఆర్ తీసేయబోతున్నారట..!

By:  Tupaki Desk   |   14 Jun 2020 4:17 AM GMT
ఈటలను కేసీఆర్ తీసేయబోతున్నారట..!
X
ఏ క్షణాన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పదవి చేపట్టాడో అప్పటి నుంచి ఆయన కంటి మీద కునుకు లేకుండా పోయిందట.. ప్రశాంత జీవితం లేకుండా చేస్తోందట.. ఎందుకొచ్చిన మంత్రి పదవి అనేలా సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆయన కుమిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈటల తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి కావడంతో ఆ హోదా పరపతి అనుభవించాడు. అయితే రెండోసారి గద్దెనెక్కాక ఈటలను దురదృష్టం వెంటాడుతోంది. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. ఈటలను అసలు మంత్రివర్గంలోకే తీసుకోరని చర్చ జరిగింది. చివరి నిమిషంలో ఈటెలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. అయితే పోయిన సారి ఇచ్చిన ఆర్థిక శాఖను పక్కన పెట్టి ఈటలకు టఫ్ అయిన వైద్య ఆరోగ్యశాఖను ఇచ్చారు.

ఆ తర్వాత ఈటల లీకులు చేస్తున్నాడని.. సరిగ్గా పనిచేయడం లేదని టీఆర్ ఎస్ అనుకూల పత్రికలో ఆయన గురించి వ్యతిరేక వార్తలు రావడం కలకలం రేపింది.. ఆయనను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం సాగింది. ఈటల హయాంలోనే డెంగ్యూ - చికెన్ గున్యా ప్రబలి చాలా మంది మరణాలు సంభవించాయి. ఈ శాఖ చూసిన ఈటల అసమర్థత అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైద్య పరికరాలు - ఈఎస్ ఐ కుంభకోణం.. మందుల కొనుగోలు ఇలా అన్నీ ఈటల కు శరాఘాతంగా మారియి.. ఒకనొక దశలో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ కూడా సాగింది.

అయితే ఇప్పుడు మరో ఉపద్రవం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో వెలుగుచూడడం.. వైద్యఆరోగ్యశాఖ తరుఫున ఈటలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. తెలంగాణలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో దీనికి బాధ్యుడిని చేసి ఈటల మంత్రి పదవిని తీసేయబోతున్నారని తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు.

తాజాగా చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను కరోనా వైఫల్యం చెప్పి పీకేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని టీఆర్ ఎస్ మిత్రుడే తనకు చెప్పాడని తెలిపాడు. ఈటల పదవి ఊస్టింగ్ కాబోతుందన్న రేవంత్ మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.