Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ పై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

By:  Tupaki Desk   |   16 May 2018 5:57 PM GMT
కేటీఆర్‌ పై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
X
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డంలో ముందుండే రేవంత్ తాజాగా మంత్రి కేటీఆర్‌పై క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. మ‌హేష్ బాబు న‌టించి ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించబ‌డిన భ‌ర‌త్ అనే నేను సినిమాకు కేటీఆర్‌ కు రేవంత్ రెడ్డి ముడిపెట్టారు. భరత్ అనే నేను సినిమాలో పేరు మార్చుకునేందుకు కేటీఆర్ పైర‌వీ చేసుకున్నాడ‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి పాత్ర పేరును భరత్ రామ్ అనే మార్చినందుకు ... కేటీఆర్ డబ్బులిచ్చాడని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా దాని ప్ర‌మోష‌న్ కోసం కూడా ప్ర‌య‌త్నించార‌ని దుయ్య‌బట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ యాంకరింగ్ చేసుకోవాల్సిందేన‌ని రేవంత్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై రేవంత్ స్పందించారు. ఈ ఎన్నిక‌ల‌కు సైతం కేసీఆర్‌ తో ముడిపెట్టారు. జేడీఎస్‌ కు మద్దతిచ్చిన సీఎం కేసీఆర్ .... జేడీఎస్ ఏ పార్టీతో వెళ్లాలనే అంశంపై త‌న అభిప్రాయం వెల్ల‌డించాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో నేడు జరిగిందే రేపు దేశంలో జరుగుతుంద‌ని ఈ నేప‌థ్యంలో త‌ను ఎటువైపో కేసీఆర్ తేల్చుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్రపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కోరారు. భారత రాజ్యాంగం పైన మోడీ - అమిత్ షా లకు నమ్మకం ఉందా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అఖండ భారత్ - సంప్రదాయాలు రక్షించే వారిగా ముద్ర వేసుకున్న వారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఒక‌నాటి భారతీయ జనతీయ జనతా పార్టీ వేరు, ఇప్పటి బీజేపీ వేరని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క ఓటుతో వాజ్‌ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయిందని...అవకాశం ఉన్నా అద్వానీ - వాజపాయి లు అక్రమ మార్గాల వైపే చూడలేదని అన్నారు. మోడీ - షా బీజేపీని చెరబ‌ట్టార‌ని ఆరోపించారు. ఫిరాయింపులు - అధికార కాంక్షతో అక్రమ మార్గాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు. తక్షణం కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని రేవంత్ డిమాండ్ చేశారు.