Begin typing your search above and press return to search.

బాబుకు రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:09 AM GMT
బాబుకు రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారే!
X
తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ దాదాపుగా చ‌చ్చిపోయింద‌నే చెప్పాలి. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంద‌రికంటే ముందే కేంద్రానికి సానుకూలంగా లేఖ‌ను ఇచ్చిన ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... తాను తెలంగాణ‌కు చేసిన మేలును చెప్పుకోలేక‌పోయారు. ఈ క్ర‌మంలో తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఆ పార్టీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. అయితే గ్రామాల్లో ప‌టిష్ట‌మైన కేడ‌ర్ ఉండ‌టం వ‌ల్ల కొన్ని అయినా సీట్లు ల‌భించాయి. అయితే ఆ సీట్లు కూడా టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప్రారంభించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు క‌నీస స్థాయికి ప‌డిపోయింది. తెలంగాణ‌లో 15 మంది ఎమ్మెల్యేలు - ఓ ఎంపీ ఉన్నటీడీపీకి ప్ర‌స్తుతం మిగిలింది ఇద్ద‌రంటే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే.

మొన్నటిదాకా తెలంగాణ‌లో ఆ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన యువ‌నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిపోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి నామ‌మాత్రంగానే త‌యారైంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి వీడిన త‌ర్వాత పార్టీ దాదాపుగా చ‌చ్చిపోయింద‌ని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు బ‌హాటంగానే వ్యాఖ్యానించారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంకో ఏడాదిలో అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటుగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్న త‌రుణంలో అన్ని పార్టీలు కూడా ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌లో మునిగిపోయాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పార్టీకి పెద్ద‌గా ఒరిగేదేమీ క‌నిపించ‌డం లేద‌న్న భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు... త‌న‌కు, పార్టీకి న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీ నుంచి వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఏపీ త‌ప్పించి తెలంగాణ పెద్ద ప‌ట్టింపే లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో టీడీపీతోనే రాజ‌కీయ ఓన‌మాలు దిద్ది... ఆ పార్టీ పురోభివృద్దికి నిన్న‌టిదాకా అవిశ్రాంతంగా కృషి చేసి ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిపోయిన రేవంత్ రెడ్డి... తెలంగాణ‌లో టీడీపీ భ‌విష్య‌త్తు ఏమిటో చెప్ప‌క‌నే చెప్పేశారు. తెలంగాణ‌లో అంప‌శ‌య్య‌పై ఉన్న టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటే త‌ప్పించి రాణించ‌లేద‌ని ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంకా టీడీపీలోనే ఉన్న మోత్కుప‌ల్లి వంటి నేత‌లు సూచించిన‌ట్లుగా టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయంపైనా రేవంత్ త‌న‌దైన స్టైల్లో స్పందించారు. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఒరిగేదేమీ లేద‌ని రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

టీడీపీని టీఆర్ఎస్‌లో చేరిస్తే... తెలుగు త‌మ్ముళ్ల‌కు ఏం ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని కూడా రేవంత్‌ ప్ర‌శ్నించారు. అయితే గియితే... టీడీపీ తెలంగాణ‌లో మ‌నుగ‌డ సాగించాలంటే... ఆ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తేనే ఫ‌లితం ఉంటుంద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌కున్నా... కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం గ్యారెంటీ అని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని టీడీపీ బ‌రిలోకి దిగితే... ఆ పార్టీకి చెందిన కొంద‌రైనా నేత‌లు ఎమ్మెల్యేలుగా గెలిచే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రి ఈ ప్ర‌తిపాద‌న‌పై చంద్ర‌బాబు అండ్ కో ఏమంటుందో చూడాలి.