Begin typing your search above and press return to search.

ప్లాన్ బీ అమ‌లు చేస్తున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   1 Nov 2016 11:30 AM GMT
ప్లాన్ బీ అమ‌లు చేస్తున్న రేవంత్‌
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై వీలైనంత ఒత్తిడి పెంచేందుకు తెలుగుదేశం తెలంగాణ శాఖ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌ రెడ్డి శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇన్నాళ్లు ఒంటరి పోరాటం చేసిన రేవంత్ దాన్నుంచి కాస్త వెన‌క్కు త‌గ్గి క‌లిసివ‌చ్చే ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి స‌ర్కారుపై క‌య్యానికి కాలుదువ్వుతున్నారు. సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే అజెండాతో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు రేవంత్ రెడ్డి మ‌ద్ద‌తిచ్చారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో మహాజన పాదయాత్ర బృందానికి రేవంత్‌ రెడ్డి తమ పార్టీ శ్రేణులతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి - మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌ రెడ్డి - ఎర్ర సత్యం - టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ - రైతు విభాగం అధ్యక్షులు ప్రతాప్‌ రెడ్డి - టీఎన్‌ ఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.మధుసూదన్‌ రెడ్డి తదితరులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాజీపేట చౌరస్తాలో సభ నిర్వహించ‌గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జల తరపున పోరాటం చేస్తున్న సీపీఎంకే తెలంగాణలో తిరిగే హక్కు ఉందని అన్నారు. ఈ పాద‌యాత్ర‌కు త‌మ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న కేసీఆర్‌ కు ఉద్యమాలతో సీపీఎం బుద్ధి చెబుతున్నదని రేవంత్‌ రెడ్డి అన్నారు. సీపీఎం పట్ల సీఎం కేసీఆర్‌ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయడం తప్పేలా అవుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2009లో ఎన్నికల కోసం మహాకూటమి కట్టినప్పుడు సీఎంకు సీపీఎం వైఖరి తెలియదా ? అని ప్రశ్నించారు. సీట్లు కావాల్సినప్పుడు సీపీఎంతో జతకట్టి - అధికారానికి వచ్చిన తరువాత ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. రైతుల పక్షాన మాట్లాడినా ప్రొఫెసర్‌ కోదండరాం పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. జస్టిస్‌(రిటైర్డ్‌)చంద్రకుమార్‌ - చుక్కా రామయ్య - వరవరరావులను విమర్శించడం పట్ల రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్ల బిల్లులు ఇవ్వడంలో ఉన్న చిత్తశుద్ది - ఫీజు రీయింబర్స్‌ మెంటుకు సంబంధించి రూ.2100 కోట్లు - ఆరోగ్య శ్రీ బిల్లులు రూ.450 కోట్లు ఎందుకు చెల్లించడం లేదన్నారు. మిషన్‌ కాకతీయకు - గుడులు - గోపురాలపై ఉన్న ప్రేమ - పేదలపై ఎందుకు లేదని ప్రశ్నించారు.రెండున్నరేళ్ల‌లో టీఆర్‌ ఎస్‌ విఫలం అయ్యినందుకే ఈ పాదయాత్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫాం హౌజ్‌ లో ఉండి పాలన చేస్తే సమస్యలు తెలియవని - గ్రామాల్లో తిరగాలని కేసీఆర్‌ ను కోరారు. జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత కొరవడిందని విమర్శించారు. ప్రతిపక్షాల పోరాటానికి - సీపీఎం పాదయాత్రకు మీడియా సహకరించాలని కోరారు. పాదయాత్ర గురించి పత్రికల్లో రాయకుండా - టీవీల్లో చూపించకుండా మీడియాపై సీఎం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

మహాజన పాదయాత్ర చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వకపోతే ఎర్ర జెండాలు పాతి భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని చేపడుతున్న ఉద్యమాలను ఆపడం - అణచివేయడం ఎవరితరం కాదన్నారు. స‌మస్యలపై 15 రోజుల్లో స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్ర జరుగుతుండగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. కలెక్టర్‌ - తహసీల్‌ కార్యాలయాలను నిర్బంధం చేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోయారని ప్రశ్నించారు. అట్టడుగు కులాలు అభివృద్ధి చెందాలంటే అవకాశాలు బాగా ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు - ఎంపీలకు వేలల్లో జీతాలు పెంచుకుంటూ... ఔట్‌ సోర్సింగ్‌ - కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపాల్జేస్తున్నారని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంద‌ని ఆయ‌న‌ ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/