Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆప్తుల‌పై గురి ఎక్కుపెట్టిన రేవంత్‌

By:  Tupaki Desk   |   5 Dec 2016 7:14 PM GMT
కేసీఆర్ ఆప్తుల‌పై గురి ఎక్కుపెట్టిన రేవంత్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త రీతిలో ఇరుకున పెట్టారు. బంగారు తెలంగాణ‌లో భాగంగా వివిధ పార్టీల నుంచి వ‌చ్చి టీఆర్ ఎస్‌ లో చేరిన‌ వారు, గ‌తంలో త‌న‌తో ప‌నిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల‌ను క‌ట్ట‌బెట్టిన కేసీఆర్ తీరుపై రేవంత్ పోరాటం మొద‌లుపెట్టారు. కేబినెట్ మంత్రులు కాకుండా 18మందికి అదనపు కేబినెట్ హోదాలను క‌ట్ట‌బెట్టార‌ని పేర్కొంటూ ఇది రాజ్యాంగానికి, హైకోరు తీర్పుకు వ్యతిరేకమ‌ని రేవంత్ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారంగా ఇచ్చిన కేబినెట్ హోదా' ల విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ వారి హోదాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు.

రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ కు చేసిన ఫిర్యాదులో భారత రాజ్యాంగంలోని ఆర్థికల్-164 (1ఎ) ప్రకారంగా అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా కేబినెట్ స్థాయి హోదాలను ఇచ్చే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని రేవంత్ తెలిపారు. దీని ప్రకారంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 18 మందికి మాత్రమే కేబినెట్ హోదా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్ సెక్రటరీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరికొంత మందికి ఈ గౌర‌వం ఇవ్వడంతో తాము హైకోర్డును ఆశ్రయించినట్లు వెల్లడించారు. అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడంతోపాటు కేబినెట్ హోదా కలిగిన కొత్త పదవులలో నియామకాలు చేపట్టకూడదని ఆ కేసులో హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు కూడా ఇచ్చింద‌ని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మిగిలిన మంత్రివర్గ సభ్యులందరూ కలిసి 18 మంది ఉన్నారని వారందరికీ కేబినెట్ హోదా ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం ఎవరికి కూడా ఉండదని చెప్పారు. అయితే ఈ 18 మంది కాకుండా అదనంగా మరో 18 మందికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా క‌ల్పించింద‌ని రేవంత్ పేర్కొన్నారు.

రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులు - ప్రత్యేక సలహాదారులు - రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు - కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు కొందరు ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్ హోదాను ప్రభుత్వం ఇచ్చార‌ని రేవంత్ వెల్లడించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కు కూడా కేబినెట్ హోదా ఇచ్చారని అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన డి.శ్రీనివాస్ కు తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారని చెప్పారు. ఈ మధ్యనే మాజీ ఎంపీ వివేక్ కు కూడా కేబినెట్ హోదా కలిగిన సలహాదారు పదవిని ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అయితే 18 మందికంటే ఎక్కువ మందికి కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా, ఈ విషయంగా గతంలో హైకోర్డు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నప్పటికీ వాటన్నింటినీ పెడచెవినపెట్టి ప్రభుత్వం ఈ హోదాలను కట్టబెట్టిందని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ హోదా పొందిన వారు కేబినెట్ స్థాయికి చెందిన అన్ని సౌకర్యాలను పొందడంతోపాటు, ఆర్థిక లాభాన్ని కూడా పొందుతున్నారని ఆరోపించారు. ఈ విధంగా అదనంగా కేబినెట్ హోదాలు ఇచ్చిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం కూడా పడుతుందని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్థికల్-164(1ఎ)కి భిన్నంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ కేబినెట్ హోదాలను తక్షణమే రదు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక వినతి పత్రం ద్వారా ఆయన రాష్ట గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇన్నాళ్లు కేసీఆర్‌ - ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై పోరాటం చేసిన‌ రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ స‌న్నిహితుల‌పై త‌న న‌జ‌ర్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/