Begin typing your search above and press return to search.

రేవంత్ టార్గెట్ లో కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం!

By:  Tupaki Desk   |   27 Jan 2017 1:20 PM GMT
రేవంత్ టార్గెట్ లో కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం!
X
రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను సంఘ‌టితం చేసి నిరవధిక ప్రజాందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర మంత్రులందరి నియోజకవర్గాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కార్యాచరణను రూపొందించిన‌ట్లు తెలిపారు. ఇందులో మొద‌టి విడ‌త‌గా సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌ - రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి అల్లోల ఇంద్ర‌క‌రణ్ రెడ్డి - పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఇది మొద‌టి విడ‌త‌గా చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో ప్రతి అంశానికి ఒక విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం ఒక విధానాన్ని ఇప్పటి దాకా ప్రకటించలేదని రేవంత్ విమర్శించారు. రైతులను ఆదుకోవడంలోనూ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడంలోనూ, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడంలోనూ, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని - పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను - ఎస్టీలు - మైనారిటీలు - వికలాంగులకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. జనరంజకమైన ఏ హామీని కూడా టీఆర్ఎస్ అమలు చేయలేకపోయిందన్నారు. శాసనసభల్లో కూడా ప్రభుత్వం మాటమార్చిందని, గతంలో 100 రోజుల్లో తెరిపిస్తామన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడు ముగిసిన చరిత్ర అని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. గతంలో తెలంగాణను బొందల గడ్డగా మారుస్తున్నాయన్న ఓపెన్ కాస్ట్ గనులపై ఇప్పుడు మాటమార్చారని, లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న నోటితోనే ఇప్పుడు చదువుకున్నవారందరికీ ఉద్యోగాలు ఎవడిస్తాడని అంటున్నారని రేవంత్ తెలిపారు. . శాసనసభలో కూడా ప్రజావాణిని వినిపించే అవకాశం ఇవ్వడం లేదని, అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా క్షేత్రంలోనే పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మొదలుపెట్టిన విద్యార్థి పోరు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాలలో కూడా భారీ బహిరంగ సభలను నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించామని రేవంత్ వెల్లడించారు. దీనిలో భాగంగా నిర్వహించే తొలి కార్యక్రమాన్ని గజ్వెల్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని, గజ్వెల్ సభలో కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

పేదలకు మాట ఇచ్చి తప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లపై, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బకాయిలపై, నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో అధికార పక్షం వైఫల్యాలపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేసీఆర్ అనుకూల వ‌ర్గం, వ్యతిరేక వర్గంగా చీలిపోయిందని విమర్శించారు. అందుకే తాము కేవ‌లం క్షేత్ర‌స్థాయి ఆందోళ‌న‌లు మాత్ర‌మే చేయ‌డంతో స‌రిపెట్ట‌కుండా కేంద్ర మంత్రుల‌కు సైతం ఫిర్యాదులు అందించ‌నున్న‌ట్లు రేవంత్ రెడ్డి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/