Begin typing your search above and press return to search.

హరీష్‌ కి షాకిచ్చినట్లే కేసీఆర్‌ కూ?

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:45 AM GMT
హరీష్‌ కి షాకిచ్చినట్లే కేసీఆర్‌ కూ?
X
రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ లీడరో అందరికీ తెలిసిందే. ఆ మధ్య హరీశ్ సహా పలువురు మంత్రులు అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు చేపట్టడానికి వెళ్లి స్థానిక ఎమ్మెల్యేగా రేవంత్‌నూ పిలిచారు. నలుగురైదురు మంత్రులు వెళ్లిన సభకు గట్టిగా అయిదారు వేలమంది కూడా రాకపోగా రేవంత్ ఎంటరయ్యాక 30-40 వేల మంది వచ్చారు. వారు చేసిన హడావుడికి హరీశ్ రావు సభలో మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఇదంతా ఇప్పుడెందుకంటే... సెప్టెంబరు 2న ప్రగతి నివేదన సభ పెడతామంటున్నారు కేసీఆర్. కానీ, ఆ సభ నిర్వహణ కేసీఆర్‌ కు సాధ్యం కాదని రేవంత్ అంటున్నారు . దీంతో రేవంత్ మైండ్‌ లో ఏదో ప్లాన్ ఉందని.. సభను వెలవెలబోయేలా చేసే ప్రయత్నం జరుగుతోందని టీఆరెస్ అనుమానిస్తోంది.

తెలంగాణా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం కావడంతో ఏం చేయాలో పాలుపోక ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శిస్తున్నారు. ఒక ఇష్యూ నుండి జనాల దృష్టిని మరల్చటం కేసీఆర్ కే సాధ్యమన్నారు. కాంగ్రెస్ సభ విజయవంతం కావడంతో ప్రజల్లో దాని ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నమే టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సభ సాధ్యం కాదని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని, ఒకవేళ సెప్టెంబర్ 2న సభ పెట్టినా 25 లక్షల మంది కూడా రారని అన్నారు.

ప్రజలను ఇంకెంతోకాలం మోసం చేయలేరని చెప్పిన రేవంత్ రెడ్డి - ఎప్పుడూ ఏదో ఒక డ్రామా చేసే కేసీఆర్‌ ఇప్పుడు ముందస్తు ఎన్నికల డ్రామాకు దిగినట్టు తెలిపారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదనే అసత్య ప్రచారానికి టీఆర్ ఎస్ నేతలు దిగుతున్నారని, అది వారి దిగజారుడుతనమని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ఆయన చెప్పారు.