Begin typing your search above and press return to search.

క్రాస్ రోడ్స్ లో రేవంత్

By:  Tupaki Desk   |   6 Dec 2015 6:32 AM GMT
క్రాస్ రోడ్స్ లో రేవంత్
X
మొన్నమొన్నటి వరకు ఆయన తెలంగాణ టైగర్.. తెలంగాణలో కేసీఆర్ పై విమర్శలు చేయగలిగిన ఒక్క మగాడు. ముఖ్యమంత్రి కేండిడేట్ అనుకున్నవాడు.. కానీ, ఇప్పుడు సొంత పార్టీలోనే అంటరానివాడుగా మారిపోయాడు. అందరూ ఆయనపై అధినేతకు ఫిర్యాదు చేసేవారే. మరోవైపు, ఆ అధినేతే తన శత్రువుతో దోస్తీ చేస్తుండడంతో తాను వెళ్లి వాళ్లతో కలవలేక.. అలా అని వేరేగా ఉండలేక క్రాస్ రోడ్లో దిక్కులు చూస్తూ నిలబడ్డాడా టైగర్. ఇదీ రేవంత్ రెడ్డి రీసెంట్ పొజిషన్. ఇలాంటి సిట్యుయేషన్లో ఆయన రకరకాల ఆలోచనలు చేస్తున్నారట. చంద్రబాబు లాగే తాను కూడా కేసీఆర్ తో దోస్తీ చేయడం బెటరా?.. టీడీపీకి గుడ్ బై చెబ్దామా..? ఒకవేళ అలా చేస్తే ఏ పార్టీలోకి వెళ్లాలి. టీఆరెస్ లోకా? కుదిరే పని కాదు. బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎందుకు మనమే ఒక పార్టీ పెడితే పోలా? ఇవీ.. రేవంత్ రెడ్డి ఆలోచనలు. అయితే, ఇవేవీ చిన్న విషయాలు కావు. సత్తా ఉన్న నాయకుడు కావడంతో అన్నిటికీ ఆయన వద్ద పక్కా స్కెచ్ లు ఉన్నాయి.

టీడీపీలో పరిస్థితి బాగులేకపోవడంతో వీడ్కోలు చెప్పి సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన రేవంత్ కు ఉందని అంటున్నారు. చంద్రబాబే కేసీఆర్ జోలికి వెళ్లడం మానేయడంతో రేవంత్ కూడా దూకుడు త‌గ్గించి ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. మరోవైపు ఎర్రబెల్లి, మోత్కుప‌ల్లి వంటి నేత‌లు రేవంత్ పై చంద్రబాబుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, చంద్రబాబు తెలంగాణ టీడీపీని పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేవంత్ అటు టీఆరెస్ లోకి వెళ్లలేక... ఇటు టీడీపీలో ఉండలేక మల్లగుల్లాలు పడుతున్నారు. మధ్యేమార్గంగా బీజేపీలోకి వెళ్తామన్నా అక్కడా ఆశాజనకంగా లేదు. దీంతో ఆయన పార్టీ ఏర్పాటు దిశగా బలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకు సామాజికవర్గం కార్డు ఉపయోగించాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి దూర‌మైన యెన్నం శ్రీనివాసరెడ్డి, అదే బాట‌లో ఉన్న నాగం జనార్దనరెడ్డిలను కలుపుకొని.. పెద్దాయన కోదండ‌రామ్‌ అండాదండా కూడా సంపాదించి రెడ్లందరినీ ఏకం చేసి పార్టీ పెడితే ఎలా ఉంటుందా అని ఆయన ఆలోచిస్తున్నారట. లేదంటే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్న భావన పెరుగుతున్న నేపథ్యంలో ఆ డిమాండు చేస్తున్న డి.కె.అరుణ వంటివారినీ కలుపుకొని ఏకంగా మరో ప్రత్యేక ఉద్యమం చేయాలా అని కూడా రేవంత్ తెగ ఆలోచిస్తున్నారట. మొత్తానికి మొన్నటి వరకు రాజా లాగ బతికి ఇప్పుడు సో మెనీ సందేహాలతో రేవంత్ దిక్కులు చూస్తున్నారు.