Begin typing your search above and press return to search.

రేవంత్ 'యాత్ర'.. ఆలోచనతో పాటు టైటిల్ అదుర్స్

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:30 PM GMT
రేవంత్ యాత్ర.. ఆలోచనతో పాటు టైటిల్ అదుర్స్
X
రాజకీయాల్లో యాత్రలది ప్రత్యేక స్థానం. ఆనాడు బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్ కే ఆడ్వాణీ రథయాత్ర నుంచి ఈనాటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాకా పాద యాత్రలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం సాగిస్తున్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ సాగించిన యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన ''ప్రజా ప్రస్థానం'' పాదయాత్రది ఓ మైలురాయి. వైఎస్ జీవితంలోనే కాక తెలుగు రాష్ట్రాల ప్రస్థానాన్నే ఆ యాత్ర మార్చివేసింది. ఇక వరుసగా రెండుసార్లు ఉమ్మడి ఏపీలో పరాజయం పాలై 2012లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర కూడా విశేషంగా నిలిచింది.

దీనికిముందు ''వస్తున్నా మీ కోసం'' అంటూ 2008లో ఆయన బస్సు యాత్ర చేశారు. అయితే, 2003లో 1,400 కిలోమీటర్ల మేర వైఎస్ చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోవడమే కాక ఆయనను ఉమ్మడి ఏపీలో బలమైన నాయకుడిగా నిలిపింది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోని వారూ వ్యక్తిగతంగా వైఎస్ కు అభిమానులయ్యారు. కానీ, 2008లో ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు చేసిన యాత్ర విజయవంతం కాలేదు. దీంతో 2012లో నేరుగా పాదయాత్రకు సిద్ధపడ్డారు. కానీ, పరిస్థితులు మరోలా సాగి 2014 నాటికి ఉమ్మడి ఏపీ విడిపోయింది. చివరకు పాదయాత్ర ప్రభావం అయితేనేమి, విభిజత ఏపీకి మెరుగైన నాయకత్వం కావాలన్న ఆలోచనతో అయితేనేమి ప్రజలు ఆయన్ను గెలిపించారు.

2017లో జగన్

2014లో అధికారంలోకి రాలేకపోయిన వైఎస్ జగన్ 2017 నవంబరు 5 నుంచి ''ప్రజా సంకల్ప యాత్ర'' పేరిట పాదయాత్ర ప్రారంభించారు. సొంతగడ్డ పులివెందుల నుంచి శ్రీకాకుళం దాకా సాగింది ఆయన యాత్ర. రికార్డు స్థాయిలో 3,648 కిలోమీటర్లు నడిచిన జగన్ అధికారానికి కావాల్సిన మార్గాన్ని ఏర్పర్చుకున్నారు. కాగా, జగన్ జైలు పాలయినప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల వారి పార్టీని ప్రజలకు చేరువ చేసే క్రమంలో 2012 అక్టోబరులో పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు 3 వేల కిలోమీటర్ల మేర ఆమె నడిచారు. అయితే, 2019 నాటికి కూడా అన్నాచెల్లెల్లి మధ్య సఖ్యత కొనసాగినా ఇప్పుడు మాత్రం వీరు దారులు వేరయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 2 వేల కిలోమీటర్లు పూర్తి చేశారు.

బండి సంజయ్ విడతల వారీగా..

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర 5విడతలుగా కొనసాగింది. ఇటీవలే ఐదో విడత యాత్ర సైతం ముగిసింది. మరో విడత ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఓవైపు షర్మిల పాదయాత్ర అధికార బీఆర్ఎస్ అడ్డంకులతో ఆగింది.

హైకోర్టు తీర్పుతో ఆమె పాదయాత్రకు మార్గం సుగమమైంది. అయితే, సంక్రాంతి తర్వాత ఆమె తిరిగి ప్రారంభించనున్నారు. రేవంత్.. రాహుల్ కు తోడుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సమాంతరంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు యాత్రలు సాగిస్తున్నాయి. అయితే, తాజాగా రేవంత్ చేపట్టనున్నట్లు చెబుతున్న పాదయాత్ర మాత్రం కొంత ప్రత్యేకంగా నిలవనుంది. రాహుల్ యాత్రకు సంఘీభావంగా దీనిని చెబుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రేవంత్ కు ఈ యాత్ర కీలకం.

లోగో అదుర్స్..

రేవంత్ పాదయాత్రకు ఎంచుకున్న లోగో లేదా టైటిల్ పేరు ''యాత్ర''గా చెబుతున్నారు. అయితే, ఇది మెరుగైన అద్భుతమైన ఆలోచన అని చెప్పాలి. ''యాత్ర'' పేరిట దివంగత సీఎం వైఎస్ పాదయాత్ర మీద సినిమా వచ్చింది. 2019 ఎన్నికల ముందు మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా హిట్ కొట్టింది. ఇప్పుడు ఆ పేరిటే.. ఆ లోగోతోటే రేవంత్ యాత్ర చేపట్టనుండడం ఆసక్తి రేపుతోంది. దీన్నిబట్టి చూస్తే.. వైఎస్ అభిమానులను దగ్గరకు చేర్చుకునే ఉద్దేశమూ కనిపిస్తోంది. ఇక యాత్ర లోగోను, టైటిల్ ను తమ పాదయాత్రకు వాడుకోవాలన్న ఆలోచన వైఎస్ కుమార్తె షర్మిలకు రాకపోవడం.. రేవంత్ వర్గం దానిని అందిపుచ్చుకోవడం విశేషం. కాగా, ''యాత్ర'' సినిమా టైటిల్ ను వాడుకోవడంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులు ఏమంటారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.