Begin typing your search above and press return to search.

తెరాస నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు!

By:  Tupaki Desk   |   27 Oct 2017 4:29 AM GMT
తెరాస నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు!
X
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరుతున్నాడు గనుక.. ఆయన వెంట ఎందరు తెలుగుదేశం నాయకులు పార్టీని వీడి - కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారో.. అనే ఊహాగానాలే ఎక్కువగా నడుస్తున్నాయి. రేవంత్ ఇంకా ఆయన వెంట మరికొంత మంది తెదేపా కీలక నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే తెదేపా పరిస్తితి ఘోరంగా తయారవుతుంది గనుక.. మరికొందరు అధికార తెరాస తీర్థం పుచ్చుకోవచ్చుననే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. అయితే అనూహ్యంగా మరో పరిణామం కూడా చోటు చేసుకోబోతున్నది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోచేరిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ బలం అనూహ్యంగా పెరుగుతున్నది అనే సంకేతాలను పరోక్షంగా ప్రజల్లోకి పంపడానికి గాను.. తెరాస నుంచి కూడా కొందరు కీలక నాయకుల్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటారని తెలుస్తోంది.

ఈ మేరకు తెరాసలో తమకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులతో రేవంత్ రెడ్డి మంతనాలు కూడా పూర్తి చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. తెరాస అధికారంలో ఉన్న పార్టీ గనుక.. అటునుంచే వలసలు వచ్చి కాంగ్రెస్ లో ఎవరైనా చేరారంటే.. పార్టీ ఇమేజి అమాంతం పెరుగుతుందని.. అందుకోసమే రేవంత్ ఆ దిశగా కూడా ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

అందరూ అనుకుంటున్నట్లుగా తెదేపా పరిస్థితి తెలంగాణలో చాలా దయనీయంగా ఉంది. అసలే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు కూడా వేసుకోవడానికి దిక్కులేని పరిస్థితి అని పలువురు అంటున్నారు. రేవంత్ ఎపిసోడ్ తర్వాత కొన్నాళ్లకు అసలు ఆ పార్టీలో ఎందరు నాయకులు ఎందరు కార్యకర్తలు మిగులుతారు అన్నది కూడా అనుమానమే. ఇలాంటి నేపథ్యంలో- రేవంత్ రెడ్డి తన కరిష్మా నిరూపించుకోవడానికి ఏకంగ తెరాస మీద కూడా కన్నేశారు. అధికార పార్టీనుంచి నేతల్ని రాబట్టడం అంత సులువు కాకపోయినప్పటికీ.. సామాజిక వర్గ సమీకరణాలను ప్రయోగించి, తమకు ఆ పార్టీలో జరుగుతున్న అవమానాలను ప్రస్తావించి.. ఏదో ఒక రకంగా ప్రేరేపించి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కొన్ని పుకార్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే తెరాసనుంచి కాంగ్రెస్ లోకి చేరికలు తక్షణం కాకుండా, మరికొన్నినెలల తర్వాత జరుగుతాయనే ప్రచారం ఉంది.