Begin typing your search above and press return to search.

రాహుల్ - బాబుల మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం

By:  Tupaki Desk   |   23 July 2018 4:27 AM GMT
రాహుల్ - బాబుల మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకుండా పోయినట్లు కనిపిస్తున్నా ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ మాత్రం ఇంకా తెలుగుదేశాన్ని గుర్తు చేసుకుంటోంది. మరోవైపు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్ రెడ్డి కూడా ఇంకా చంద్రబాబుతో బాగానే టచ్‌ లో ఉన్నారట. అంతేకాదు..తరచూ దిల్లీ వస్తూ రాహుల్ గాంధీతోనూ ఆయన ర్యాపో మెంటైన్ చేస్తున్నారు. అదేసమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ పై విమర్శలూ తగ్గించింది. దీంతో.. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఈ మేరకు చంద్రబాబుతో డీల్ చేసే పని రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం.

అసలు రేవంతే కాంగ్రెస్‌ ను ఈ దిశగా మూవ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరబాద్ - ఖమ్మం - నిజామాబాద్‌ లలొని పలు జిల్లాల్లోని టీడీపీ నేతలను ఆయన ఇప్పటికే సంప్రదించారట. దీనిపై ఆయన అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఈ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుంది... టీఆరెస్‌ ను దెబ్బతీయడానికి ఈ కాంబినేషన్ ను ఎలా ఉపయోగించుకోవాలన్న పూర్తి వివరాలు రెడీ చేసి అటు రాహుల్ - ఇటు చంద్రబాబు ఇద్దరితో ఆ వివరాలు షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరోవైపు చంద్రబాబు ఏపీలోనూ కాంగ్రెస్‌ కు అనుకూలంగా కనిపిస్తున్నారు. కాంగ్రెస పై టీడీపీ నుంచి ఒక్క విమర్శ కూడా ఉండడం లేదు. అలాగే, కాంగ్రెస్ నేతలూ టీడీపీని విమర్శించడం మానేశారు. మొన్నటి అవిశ్వాసంలో టీడీపీ - కాంగ్రెస్‌ లు కలిసి నడిశాయి. అయితే... రెండు పార్టీలూ దేనికవి గుంభనంగా ఉంటుండడంతో ఇంకా పొత్తులపై చర్చ వరకు వెళ్లలేదు. ఇప్పుడు రేవంత్ కనుక మధ్యవర్తిత్వం వహిస్తే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్- టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశం ఉంది.