Begin typing your search above and press return to search.

10 సీట్లకు రేవంత్ ఎసరు..ఇస్తారా..ఇవ్వరా?

By:  Tupaki Desk   |   14 Oct 2018 10:06 AM GMT
10 సీట్లకు రేవంత్ ఎసరు..ఇస్తారా..ఇవ్వరా?
X
తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సూటిగా సంధించే నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఆయన అధిష్ఠానం వద్ద పార్టీ టిక్కెట్ల విషయమై పట్టుబడుతున్నారట. తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారికి సీట్ల కేటాయింపు జరగాల్సిందేనని పేచీ పెడుతున్నారట. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

టీ టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి , మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ లో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. కేసీఆర్ మీద దూకుడుగా ఉండే ఆయన తన అనుచర వర్గాన్ని కూడా వెంట తెచ్చుకున్నారు. వీరందరిని ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ భుజాన వేసుకున్నారు. ఆ మేరకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేస్తున్నారట.

రేవంత్ తోపాటు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, అరికెల నర్సిరెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, విజయ రమణారావు ఇలా చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చారు. పార్టీలో చేరుతున్నప్పుడే పోటీ చేసే అవకాశంపై ఢిల్లీ పెద్దల వద్ద హామీ పొందినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లోనూ రేవంత్ టీం గానే కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కనీసం 10 టిక్కెట్లు ఇవ్వాలని అడుగుతున్నారట రేవంత్. వారందరి గెలుపు బాధ్యత తనదేనని హామీ ఇస్తున్నాడట.. అయితే, పార్టీ నేతలు మాత్రం సీట్ల సర్దుబాటులో భాగంగా 3 నుంచి 4 సీట్లు మాత్రమే ఇస్తానని అంటున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ కు తన టీం నుంచి పెద్ద చిక్కు వచ్చి పడింది.

ఈ వ్యవహారంపై ఆయన ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. ఒక వేళ అలక బూనితే పరిస్థితి ఏంటనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో గ్రూప్ పొలిటిక్స్ మళ్లీ మొదలవుతాయా అన్న ప్రశ్న మొదలైంది.