Begin typing your search above and press return to search.

ఎన్టీవోడిని తిట్టిస్తావా ఏంది రేవంత్?

By:  Tupaki Desk   |   17 Jan 2017 5:39 AM GMT
ఎన్టీవోడిని తిట్టిస్తావా ఏంది రేవంత్?
X
కొన్ని మాటలు కొన్నిచోట్ల అస్సలు పనికి రావు. ఏదో రాజకీయం కోసం మాట్లాడినా.. దాని వల్ల కొత్తరకం తిట్లు తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి మాటలుఇదే తీరులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విషయానికి వస్తే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఎన్టీవోడి గురించి పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎవరినైనాసరే.. అవసరం.. అవకాశాన్ని అనుసరించి ఉతికి ఆరేస్తుంటారు.కానీ.. ఎన్టీఆర్ మీద మొదటి నుంచి ఆయనకున్న ప్రేమ వల్ల కావొచ్చు.. అభిమానం అయి ఉండొచ్చు.. వీలైతే పొగిడేస్తారే కానీ పల్లెత్తు మాట అనరు. అయితే.. దాన్నో బలహీనతగా భావించి ఒకటికి రెండుసార్లు కెలికితే.. ఒక మాట అన్నా అనేసే ప్రమాదం ఉంది.

ఇక్కడ ఎన్టీవోడి మీద కేసీఆర్ కున్న ప్రేమాభిమానాల్ని తప్పు పట్టటం లేదు. ఆయన నమ్మి వినిపించే తెలంగాణ వాదం తర్వాతే ఎవరైనా. ఎంత మనసులో అభిమానం ఉంటే మాత్రం.. ఎన్టీవోడి మీద తెలంగాణలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టలేరు కదా. ఒకవేళ ఎన్టీవోడి పేరుతో సంబంధం లేని రాజకీయ పార్టీ ఉండి ఉంటే అలాంటి నిర్ణయం కేసీఆర్ తీసుకునేవారేమో. కానీ.. ఓపక్క ఎన్టీఆర్ పెట్టినట్లుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు.. ఎన్టీవోడి పేరును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి పెట్టటం దగ్గర నుంచి.. ఎన్టీఆర్ జయంతి.. వర్థంతి కార్యక్రమాల్ని రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఏముంది?

కానీ.. పుల్ల పెట్టి కెలికినట్లుగా ఎన్టీఆర్ పేరుతో కేసీఆర్ ను టార్గెట్ చేయాలన్న రేవంత్ లక్ష్యం మొదటికే మోసం వచ్చేదిగా చెప్పాలి. ఎన్టీఆర్ పేరును పదే పదే తలవటం ద్వారా.. ఇప్పటి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కు ఏం చేసిందన్న ప్రశ్నను కేసీఆర్ సూటిగా ప్రశ్నించే ఏం చేస్తారు? ప్రతి దానికి ఎన్టీవోడి పేరుతో తెలంగాణలో ఏదో చేయాలన్న డిమాండ్ పై కేసీఆర్ కానీ కాస్తంత సీరియస్ అయితే దాని వల్ల జరిగే నష్టం కేసీఆర్ కంటే కూడా ఎన్టీఆర్ కే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఎన్టీఆర్ ను రాజకీయంగా మార్చేసి.. ఒక వర్గానికి పరిమితం చేసేలా చేసిన తెలుగు తమ్ముళ్ల పుణ్యమా అని ఆయన్ను తెలుగు ప్రముఖుడిగా గుర్తించకుండా చేశారన్నది మర్చిపోకూడదు. చేసింది సరిపోనట్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతి.. వర్థంతిని అధికారికంగా జరపాలన్న డిమాండ్ తో పాటు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మార్చాలన్న డిమాండ్ సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇప్పించాలన్న డిమాండ్ మీద ఎన్టీఆర్ పేరు పెట్టుకొని.. ఆయన పేరుతో ఇప్పటికి బతికేసే తెలుగుదేశం ఎలాంటి ప్రయత్నాలు చేయని వేళ.. అలివి కాని డిమాండ్లను రేవంత్ రెడ్డి తెర మీదకు తీసుకురావటం ఏ మాత్రం సరికాదన్నది మర్చిపోకూడదు. ఏ వ్యక్తినైతే పార్టీ నుంచి తరిమేసి.. తమదే అసలైన తెలుగుదేశం పార్టీగా చెప్పుకొన్న నేతలంతా ఈ రోజుకీ తాము తరిమేసిన వ్యక్తి పేరుతో ఓట్లు అడుకునే దుర్మార్గానికి తెగబడటం ఒక ఎత్తు అయితే.. రాజకీయ చట్రంలో ఎన్టీవోడిని ఫిక్స్ చేయటం ద్వారా అందదరివాడిని కాస్తా కొందరివాడిగా మార్చేశారన్న చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/