Begin typing your search above and press return to search.

మార్కెట్ మార్పు వెనుక కుట్ర - కుంభకోణం..రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

By:  Tupaki Desk   |   5 May 2020 4:30 PM GMT
మార్కెట్ మార్పు వెనుక కుట్ర - కుంభకోణం..రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
X
హయత్ నగర్ మండలం కోహెడ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ తాజాగా కురిసిన గాలివాన బీభత్సానికి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ మంగళవారం చేశారు. కోహెడలోని మార్కెట్‌ ను మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడున్న మామిడి రైతులు, వ్యాపారులు, వాహన డ్రైవర్లతో సంభాషించారు.

కనీసం ఆ మార్కెట్‌ లో తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేవని మహిళా కూలీలు రేవంత్ ‌కు చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రతి రోజు 10 వేల మంది వచ్చే మార్కెట్‌ లో కనీస సదుపాయాలు కూడా లేవని, కోహెడ తాత్కాలిక పండ్ల మార్కెట్ గాలి వానలకు పూర్తిగా నాశనమైందని అన్నారు. హడావుడిగా గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ ‌ను కోహెడకు మార్చడం వెనుక కుట్ర ఉందని, ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. అలాగే దీనిపై తక్షణమే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, మార్కెట్ ధ్వంసం అయిన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా 3 రోజుల పాటు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తెరిచి మామిడి క్రయ, విక్రయాలను జరిపేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా దెబ్బతిన్న కోహెడ మార్కెట్‌కు రూ.8 కోట్ల బీమా ఉందని.. రైతులకు రూ.4కోట్ల బీమా సదుపాయం ఉందని ఆయన వివరించారు. అలాగే మరో మూడు రోజుల్లో దెబ్బతిన్న కోహెడ మార్కెట్‌ను మరో 3 రోజుల్లో పునరుద్ధరిస్తామని ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం చెప్పారు.