Begin typing your search above and press return to search.

రేవంత్- టీఆర్ ఎస్ చాలెంజ్‌ ల ప‌ర్వం

By:  Tupaki Desk   |   10 Jan 2018 3:55 PM GMT
రేవంత్- టీఆర్ ఎస్ చాలెంజ్‌ ల ప‌ర్వం
X
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 24 గంట‌ల విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసే ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. ఈ ప‌ర్వం అధికార టీఆర్ ఎస్ పార్టీ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ ల మ‌ధ్య స‌వాళ్లు - ప్ర‌తిస‌వాళ్ల‌కు వేదిక‌గా మారుతోంది. క‌రెంటు స‌ర‌ఫ‌రా విష‌యంలో టీఆర్ ఎస్ పార్టీవ‌న్నీ దొంగ‌లెక్క‌లేన‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. అయితే దీన్ని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అవినీతి నిరూపిస్తే ముక్కునేల‌కు రాస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనికి రేవంత్ రెడ్డి వెంట‌నే ఓకే చెప్పేశారు. వెన్యూ కూడా ఖ‌రారు చేసి మ‌రింత హీట్ పెంచారు.

గాంధీభ‌వ‌న్‌ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2014 నవంబర్ 10న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మూడేళ్లలో 21వేల మెగావాట్లు ఉత్పత్తి సామర్ధ్యం తెస్తామని చెప్పారని, అయితే ఈ ప్రకటనపై రోజే తాను స్పందించాన‌ని అన్నారు. `ఆనాడే.. 15 వేల మెగావాట్లు తెచ్చినా సన్మానం చేస్తానని చెప్పాను. రాష్ట్రంలో యాదాద్రి - భద్రాద్రి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. భద్రాద్రి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక బీహెచ్ ఈఎల్ కు ఇచ్చామన్నారు. అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినందుకు 23 మంది అధికారుల పై ఎన్జీటీ క్రిమినల్ కేసులు పెట్టింది. ఇండియాబుల్స్ సంస్థకు మేలు చేసేందుకు నిషేధిక టెక్నాలజీతో తయారు చేసిన బాయిలర్లు కొన్నారు. ఇండియాబుల్స్ సంస్థను కాపాడటం కోసం తెలంగాణ జెన్ కోను బలిచ్చారు. విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అప్పుచేయబోతున్నారు. దీనిపై విద్యుత్ మంత్రి లేదా అధికారులు ఎవరొచ్చినా బహిరంగ చర్చకు నేను సిద్ధం` అని రేవంత్ స‌వాల్ విసిరారు.

దీనిపై ఎంపీ బాల్క సుమ‌న్ ఘాటుగా స్పందించారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. గాంధీ భవన్ అబద్దాల భవన్‌గా మారిందని వ్యాఖ్యానించారు. కరెంటు కష్టాల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఎంపీ సుమ‌న్ తెలిపారు. తెలంగాణకు - కరెంట్ రెంటి మధ్య బంధం పెనవేసుకుందని తెలిపారు. కరెంటుపై రేవంత్ చెప్పే లెక్కలన్నీ తప్పని నిరూపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్ లాంటి సన్నాసులు ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. తాము కరెంటుపై చెప్పే లెక్కలు అబద్దమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగం పై బహిరంగ చర్చకు రా రేవంత్. .పీసీసీ చీఫ్ ఉత్తమ్ - సీఎల్పీ నేత జానాతో కలిసి చర్చకు వచ్చినా అభ్యంతరం లేదు. సమయం - స్థలం రేవంత్ నిర్ణయించినా అభ్యంతరం లేదు. మా వైపు నుంచి నాతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి - భానుప్రసాద్ చర్చకు వస్తాం. మేం చెప్పేవి అబద్దాలు అయితే నేను ముక్కు నేలకు రాస్తా. రేవంత్ చెప్పేది అబద్దమైతే అబిడ్స్ చౌరాస్తా లో ముక్కు నేలకు రాయాలి` అని స‌వాల్ విసిరారు.

అయితే...బాల్క సుమ‌న్ విలేక‌రుల స‌మావేశం వెంట‌నే రేవంత్ రెడ్డి స్పందించారు. `టీఆర్ ఎస్ సవాల్‌ కు కాంగ్రెస్ సిద్ధం...విద్యుత్ వెలుగుల వెనకాల ఉన్న చీకటి ఒప్పందాలపై చర్చకు మేం రెడీ` అని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. `ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పక్షాన నాతోపాటు - ఎమ్మెల్యే సంపత్ కుమార్ - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ వస్తాం. వేదిక ప్రగతి భవన్ అయినా సరే, ఇంకా ఎక్కడైనా సరే మేము సిద్ధం. అక్రమ వ్యాపారాలు - చీకటి విద్యుత్ ఒప్పందాలు - అబద్ధపు ప్రచారాలు - అన్నింటినీ బయట పెడతాము. టీఆర్ ఎస్ నాయకులు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలి` అని ప్ర‌క‌టించారు.