Begin typing your search above and press return to search.

రమ‌ణ ఎత్తుకు..రేవంత్ పై ఎత్తు

By:  Tupaki Desk   |   25 Oct 2017 12:58 PM GMT
రమ‌ణ ఎత్తుకు..రేవంత్ పై ఎత్తు
X
తెలంగాణ టీడీపీలో ఇంటిపోరు అనూహ్య‌మైన మ‌లుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతుండ‌గా...తాజాగా ఆయ‌నకు చెక్ పెట్టేందుకు తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ రంగంలోకి దిగారు. అయితే దీనికి కౌంట‌ర్‌ గా రేవంత్ సైతం ప్ర‌ణాళిక‌లు వేయ‌డంతో...తెలంగాణ టీడీపీలో ఆధిప‌త్య‌పోరు తార‌స్థాయికి చేరింది.

రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి త‌ప్పించేందుకు రంగం సిద్ధమైంది. రేవంత్ రెడ్డి రేపు టీడీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేశారు. దానికి కౌంట‌ర్ గా గోల్కొండ హోట‌ల్లో టీడీపీ- బీజేపీ నేత‌ల భేటీని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ర‌మ‌ణ‌ ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యే హోదాలో రేవంత్ ను సైతం ఆహ్వానించారు. అలాగే త‌న అనుమ‌తి లేకుండా టీడీఎల్పీ స‌మావేశానికి ఎవ‌రిని ఆహ్వానించొద్ద‌ని రేవంత్ కు ఆదేశించారు. మ‌రోవైపు పార్టీలో ప‌రిణామాల‌ను ర‌మ‌ణ.. చంద్ర‌బాబుకు వివ‌రించారు. రేవంత్ రెడ్డిని పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పించాల‌ని బాబుకు లేఖ రాశారు. లండ‌న్ నుంచి పార్టీ ప‌రిణామాల‌పై స‌మీక్షించిన చంద్ర‌బాబు ఇలాగే ముందుకెళ్లాల‌ని ర‌మ‌ణ‌కు సూచించారు.పార్టీ అధ్య‌క్షుడిగా తాను ఈ ఆదేశాలు ఇస్తున్న‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుకు సాగాల‌ని కోరారు. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీడీపీ - బీజేపీ ఎమ్మెల్యేలు - ముఖ్య‌నేత‌ల‌తో ఎల్.ర‌మ‌ణ స‌మావేశం కానున్నారు.

మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీలో టీడీఎల్పీ సమావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు రేవంత్ ప్ర‌క‌టించారు. ఎల్‌.రమణతో సహా ముఖ్య నేతలను రేవంత్ సమావేశానికి ఆహ్వానించారు. టీడీఎల్పీ స‌మావేశం యథావిధిగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఇవ్వాల‌నుకుంటున్న వివ‌ర‌ణ‌ను చంద్ర‌బాబుకే ఇస్తాన‌ని రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు. శాసన‌స‌భ వ్య‌వ‌హారాల్లో ఎవ‌రికీ జోక్యం చేసుకునే అధికారం లేద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి వివాదం ముదురుతోందనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని అంటున్నారు.