Begin typing your search above and press return to search.

మోత్కుప‌ల్లి వ‌ర్సెస్ రేవంత్‌: మోత్కుప‌ల్లి వాకౌట్‌

By:  Tupaki Desk   |   20 Oct 2017 10:01 AM GMT
మోత్కుప‌ల్లి వ‌ర్సెస్ రేవంత్‌:  మోత్కుప‌ల్లి వాకౌట్‌
X
తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్‌ గా మారింది. ఆయ‌న కాంగ్రెస్‌ లోకి జంప్ చేస్తారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగిన విష‌యం తెలిసిందే. అయితే, అదేస‌మ‌యంలో ఏపీ టీడీపీ మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు - ప‌రిటాల సునీత‌ - ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ ల‌పై చేసిన సంచ‌ల‌న కామెంట్లు సైతం టీడీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. దీంతో నేత‌లు ఒక్క‌సారిగా రేవంత్ వ్య‌వ‌హార శైలిపై విరుచుకుప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. శుక్ర‌వారం టీటీడీపీ వ‌ర్కింగ్ క‌మిటీ నేతల భేటీ జ‌రిగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్‌ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని భావిస్తున్న రేవంత్‌ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు - అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డట్టు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు ఎవరెవరిని కలిశారో చెప్పాలని రేవంత్‌ ను మోత్కుపల్లి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఎందుకు జరిపారని ఆయనను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తో చర్చలు జరిపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. యనమల రామకృష్ణుడు - పరిటాల సునీత - పయ్యావుల కేశవ్‌ లపై ఎందుకు ఆరోపణలు గుప్పించావని రేవంత్‌ ను మోత్కుపల్లి మరోసారి నిలదీసినట్టు సమాచారం.

ఇక‌, కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ పొత్తు విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్‌ తో పొత్తు ఎలా సాధ్యమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ.. రేవంత్‌ ను నిల‌దీసిన‌ట్టు తెలిసింది. అయితే, వీరి ప్ర‌శ్న‌ల‌కు రేవంత్ కూడా దీటుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్ని విషయాలూ చంద్రబాబుకే చెప్తానంటూ ఎదురుదాడికి దిగారని తెలుస్తోంది. చంద్రబాబుతోనే అన్నీ తేల్చుకుంటానని తెగేసి చెప్పినట్టు సమాచారం. నేనెవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్‌ ఘాటుగా బదులిచ్చినట్టు సమాచారం. రేవంత్‌ సమాధానాలతో అసహనానికి గురైన మోత్కుపల్లి - అరవింద్‌ కుమార్‌ గౌడ్ స‌మావేశం నుంచి వాకౌట్‌ చేసినట్టు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ టీడీపీ నేత‌ల సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన పార్టీ సీనియ‌ర్ నేత‌ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి...ఈ వివాదాన్ని త‌క్కువ చేసి చూపే ప్ర‌య‌త్నం చేశారు. మోత్కుప‌ల్లి వాకౌట్ చేశార‌నే దాంట్లో వాస్త‌వం లేద‌న్నారు. రాజ‌కీయాలు పెద్ద‌గా చ‌ర్చించ‌లేద‌ని తెలిపారు. త‌మ స‌మావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 119నియోజకవర్గాలలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.