Begin typing your search above and press return to search.

వైఎస్ పై ప్రేమతో.. రేవంత్ రెడ్డి అనూహ్యం

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:30 PM GMT
వైఎస్ పై ప్రేమతో.. రేవంత్ రెడ్డి అనూహ్యం
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరికి చెందిన వారు అంటే.. ఏపీలోని వైఎస్ఆర్ సీపీ తమ వాడే అంటారు. జగన్ తన నాన్న తమకు చెందిన వ్యక్తి అని ప్రకటిస్తారు. ఇక తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. నాన్న వైఎస్ఆర్ నే ప్రతిసారి స్మరిస్తూ ఆయన పేరుమీదనే పార్టీ పెట్టి ఓన్ చేసుకుంది.

అయితే వీరిద్దరూ కాదని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ తమ వాడేనని ఘంఠాపథంగా చెప్పుకొచ్చింది. వైఎస్ఆర్ 12వ వర్థంతిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించడం విశేషం. గాంధీభవన్ లో వైఎస్ చిత్రపటానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్ ఆత్మ కేవీపీ సహా నాడు వైఎస్ఆర్ తో పనిచేసిన కాంగ్రెస్ నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది వైఎస్ఆర్ కల అని.. దాన్ని మేం నెరవేరుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఆకాంక్ష నెరవేర్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.

కృష్ణా నది జలాల పంపకం విషయంలో వివాదాలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీ నీళ్లు కేటాయించారని.. ఏపీకి, తెలంగాణ మధ్య నీటి వివాదాలు వస్తే పునర్విభజన చట్టంలో అపెక్స్ కమిటీ బోర్డులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోను అని కేసీఆర్ అన్నారని.. కానీ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు సెంట్రల్ హాల్ కు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ఎంపీ సంతోష్ రావు.. సపరేట్ గా ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. కానీ కృష్ణా నదిలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదని మండిపడ్డారు.

ఇలా వైఎస్ఆర్ ను అందరూ ఓన్ చేసుకుంటూ ఆయన పాలన, వైభవం, అభిమాన గణాన్ని సొంతం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు.