Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చేరికలో సమతూకం చూపిన రేవంత్

By:  Tupaki Desk   |   31 Oct 2017 8:23 AM GMT
కాంగ్రెస్ చేరికలో సమతూకం చూపిన రేవంత్
X
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనే లాంఛనం పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. తెలుగుదేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కీలకంగా చక్రం తిప్పిన రేవంత్ ఇక కాంగ్రెస్ ప్రతినిధిగా కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం సల్పడానికి సిద్ధం కాబోతున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంలో రేవంత్ తో పాటు మరో 17 మంది నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 18 మంది మాత్రమే రాహుల్ సమక్షంలో చేరారు.

నిజానికి రాహుల్ గాంధీ వద్దకు బలప్రదర్శన తరహాలో కాకుండా పరిమిత సంఖ్యలో నాయకుల్ని వెంటబెట్టుకు రమ్మని పురమాయించినట్లుగా ముందుగానే వార్తలు వచ్చాయి. దానికి తగినట్లుగా రేవంత్ కేవలం 18 మంది నాయకుల బృందంగానే వెళ్లారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కుంతియా లు కూడా వారి వెంట ఉండి చేరిక కార్యక్రమాన్ని నడిపించారు.

తన వెంట నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గాల పరంగా సమతూకం పాటించినట్లు కూడా తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే పుకార్లు వచ్చిన నాటినుంచి ఆయనకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రచారం చేయడానికి కిట్టని వారు కొందరు ప్రయత్నించారు. రేవంత్ వెంట.. రెడ్డి వర్గానికి చెందిన కొందరు మాత్రమే వెళ్తారని.. అంతకు మించి.. ఆయన ప్రభావం చూపించలేరని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల్ని తిప్పికొట్టేలా.. సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ.. అన్ని వర్గాల వారిని వెంటబెట్టుకుని మొత్తం 18 మంది బృందంతో రేవంత్ పార్టీలో చేరారు. వీరిలో రేవంత్ రెడ్డితో పాటు - సీతక్క - వేంనరేందర్ రెడ్డి - విజయ రమణ రావు - అరికెల నర్సా రెడ్డి - బోడ జనార్దన్ - సోయం బాబు రావు - పటేల్ రమేష్ రెడ్డి - దొమ్మటి సాంబయ్య - తోటకూర జానయ్య ఉన్నారు. ఇక్కడికి 15 మందికాగా - మరో ముగ్గురు ఓయూ జాక్ సభ్యులు. కవ్వంపల్లి సత్యనారాయణ - మేడిపల్లి సత్యం - హరిప్రియ నాయక్ - బల్య నాయక్ - రాజారాం యాదవ్.

నిజానికి రేవంత్ వెంట తొలినాడే పార్టీ మారడానికి ఇంకా చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని... అయితే ఢిల్లీకి పరిమితంగా వెళితే చాలు అనే అభిప్రాయంతో పాటూ.. కులాల సమతూకం చెడకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ ఇలాంటి జాగ్రత్త తీసుకున్నట్లుగా తెలుస్తోంది.