Begin typing your search above and press return to search.

జన్ పథ్ లో 'మునుగోడు' మీటింగ్.. కీలక విషయాన్ని వెల్లడించిన రేవంత్

By:  Tupaki Desk   |   23 Aug 2022 3:50 AM GMT
జన్ పథ్ లో మునుగోడు మీటింగ్.. కీలక విషయాన్ని వెల్లడించిన రేవంత్
X
హాట్ టాపిక్ గా మారింది 'మనుగోడు' ఉప ఎన్నిక అంశం. ఉప పోరుకు నోటిఫికేషన్ విడుదలకు ముందే అగ్గి రాజేసిన ఈ ఉప ఎన్నిక గురించి కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా మధనం జరిపిన వైనం చూస్తే.. ఈ ఎన్నికకు ఉన్న ప్రాధాన్యం ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా 10 జన్ పథ్ లో ప్రియాంక గాంధీ.. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో రేవంత్.. భట్టి విక్రమార్క.. ఉత్తమకుమార్ రెడ్డి.. మధుయాష్కీ గౌడ్.. జీవన్ రెడ్డి.. శ్రీధర్ బాబు.. దామోదర్ రాజ నర్సింహా తదితర అగ్రనేతలంతా హాజరయ్యారు.

ఈ మీటింగ్ మొత్తం 'మునుగోడు' చుట్టూనే జరిగినట్లు చెబుతున్నారు. మునుగోడు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. ఉప ఎన్నికను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంతో పాటు.. పార్టీలో క్రమశిక్షణపై హైకమాండ్ తో మాట్లాడినట్లుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎవరన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన రేవంత్.. కీలక వ్యాఖ్య చేశారు.

మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థి పేరును పార్టీ జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్ఠానం చెబుతుందన్న మాటకు బదులుగా రేవంత్ నోట వచ్చిన తాజా వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కీలక మీటింగ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హజరు కావటంపైనా మాట్లాడారు రేవంత్. టైం సరిపోని కారణంగా మీటింగ్ కు రాలేదని.. వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చించామన్నారు. ఆయన అభిప్రాయాన్నితీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అందరిని కలుపుకొని మనుగోడులో పని చేస్తామన్న రేవంత్ మాటలు చూస్తే.. సమావేశంలో కోమటిరెడ్డి ఇష్యూపై కాసింత గట్టిగానే చర్చ జరిగినట్లుగా అనిపించక మానదు.