Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను ఇంకా అర్థం చేసుకోవాలి రేవంత్ !

By:  Tupaki Desk   |   4 Sep 2021 11:30 AM GMT
కాంగ్రెస్ ను ఇంకా అర్థం చేసుకోవాలి రేవంత్ !
X
తాజా ఘటనతో కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటుందో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి బాగా అనుభవంలోకి వచ్చుంటుంది. మిగిలిన పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంటుందన్న విషయాన్ని రేవంత్ మరచిపోయినట్లున్నారు. అందుకనే అనవసరంగా ఆదేశాలు జారీ చేసి చివరకు అభాసుపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సొంత బలం ఉన్న నేతల్లో చాలామంది పీసీసీ అధ్యక్షుడి మాటను ఏమాత్రం లెక్కచేయరు. పీసీసీ అధ్యక్షుడి మాటను పార్టీలోని నేతలంతా వినటమన్నది చాలా చాలా అరుదనే చెప్పాలి.

పార్టీ అధ్యక్షుడి మాటే కాదు చివరకు ముఖ్యమంత్రి కూడా వినరన్న విషయం అందరికీ తెలిసిందే. సీఎం అయినా పీసీసీ అధ్యక్షుడి మాటైనా అందరు వింటున్నారంటే సదరు నేతపై మిగిలిన వారికి భయమో లేదా భక్తో లేదా భయంతో కూడిన భక్త వల్ల వచ్చిన గౌరవమో ఉండితీరాలి. పై అంశాల్లో రేవంత్ అంటే చాలామందికి ఇటు భయమూ లేదు ఇక భక్తిగురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకనే రేవంత్ వద్దన్నా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపి ఎంఏ ఖాన్ వైఎస్సార్ 12 వర్దంతిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశానికి హాజరైన కోమటిరెడ్డి అక్కడ ఏమి మాట్లాడారు అనేదానికన్నా బయట మీడియాతో ఏమి చెప్పారన్నదే ఇఫుడు ఆసక్తిగా మారింది. పార్టీ వద్దన్నా ఆత్మీయ సమావేశానికి హాజరైన విషయాన్ని మీడియా నేరుగా కోమటిరెడ్డిని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆయన వర్ధంతి సందర్భంగా జరిపిన సమావేశానికి హాజరు కావద్దని చెప్పడం ఏమిటంటు ఎదురు ప్రశ్నించారు.

వైఎస్సాాఆర్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే వెచ్చించిన విషయం పార్టీకి తెలీదా అని నిలదీయటం ఆశ్చర్యం. మూడు రోజుల క్రితం విజయమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే తాను సమావేశానికి హాజరైనట్లు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ అయ్యుండి చంద్రబాబునాయుడుకు రాఖీ కట్టడానికి వెళ్ళచ్చా అని వేసిన ప్రశ్నకు రేవంత్ సమాధానం చెప్పాల్సిందే. మొన్నటి రాఖీ పండుగ రోజున కాంగ్రెస్ ఎంఎల్ఏ సీతక్క తన మాజీ బాస్ చంద్రబాబు దగ్గరకు వెళ్ళి రాఖీ కట్టిన విషయాన్నే ఇఫుడు ఎంపి గుర్తుచేశారు.

ఇక్కడ రేవంత్ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి తాను అధ్యక్షుడు అయినంత మాత్రాన నేతలందరు తనమాటే వినాలని అనుకోవటం తప్పు. చాలామంది నేతలు రేవంత్ మాటను లెక్క కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ జిల్లాల్లో వాళ్ళంతా బలమైన నేతలే. అంతేకాకుండా అధిష్టానంతో చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలని రేవంత్ సిఫారసు చేసినా జరిగే పని కాదు.

కాబట్టి పార్టీలోని బలమైన నేతల విషయంలో చూసీ చూడనట్లు రేవంత్ వెళితేనే తనకు మర్యాదగా ఉంటుంది. లేకపోతే తనకు వ్యతిరేకంగా అందరు ఏకమైతే ఇబ్బందులు మొదలైనట్లే అని రేవంత్ గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే ఇదే విషయం చాలా స్పష్టంగా రేవంత్ కు అర్ధమవుతుంది. కాబట్టి తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం మానేసి అందరి నేతలతో తాను కూడా ఒకడిని అని రేవంత్ అనుకుంటేనే మంచిది. లేకపోతే ఇప్పటి లాగే ముందు ముందు కూడా అభాసుపాలవ్వటం తప్పదని గ్రహించాలి.