Begin typing your search above and press return to search.

అడ్డుకున్న పోలీసుల్ని దాటేసి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన రేవంత్

By:  Tupaki Desk   |   13 Oct 2021 5:32 AM GMT
అడ్డుకున్న పోలీసుల్ని దాటేసి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన రేవంత్
X
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య వరకు తెలంగాణ అధికారపక్షానికి సవాలు విసిరేలా.. వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసేలా వ్యవహరించిన విపక్ష నేత లేరనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గులాబీదళానికి బలమైన రాజకీయ అధినేతగా బండి సంజయ్ నిలిచారని చెప్పాలి. తాజాగా ఆయన స్థానానికి తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆక్రమించారు.

తనను పదవిలో కూర్చొబెట్టిన నాటి నుంచి.. తరచూ ఏదోఒక కార్యక్రమంలో పాల్గొనటం.. బహిరంగ సభల్ని నిర్వహించటం.. పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించటం.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఏకరువు పెట్టటంతోపాటు పార్టీని మరింత ఉత్తేజం చెందేలా చేయటం ఆయన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విపరీతమైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. తాజాగాచోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పాలి. నిరుద్యోగుల ఇష్యూను టేకప్ చేసిన ఆయన.. తరచూ నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళనల్ని నిర్వహిస్తున్నారు.

తనను అడ్డుకునే పోలీసులకు ఆయన ఊహించని రీతిలో షాకులిస్తున్నారు. మంగళవారం విషయానికే వస్తే.. పాలమూరు టౌన్ మీదుగా వెళ్లేందుకు అనుమతి లేదంటూ జడ్చర్ల క్రాస్ రోడ్డును పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు.. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కానీ.. వాటిని తొలగించుకొని మరీ డివైడర్ మీదుగా తమ వాహనాల్ని తీసుకెళ్లిపోవటంతో పోలీసులు ఈ పరిణామానికి స్పందించే లోపే వారు వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ లో రేవంత్ కాన్వాయ్ ను మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన మొండిగా రాంగ్ రూట్ లోకి వెళ్లటమే కాదు.. కాస్తంత దూకుడుగానే సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తనను అడ్డుకునే పోలీసులకు కాస్తంత షాకిచ్చారు. అంతేకాదు.. సభకు హాజరైన ఆయన.. తన ప్రసంగంలోకీలక వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకొని వేధిస్తున్నపోలీసుల అందరి పేర్లను తాను డైరీలో రాసుకున్నానిన.. రాబోయే రోజుల్లో వారి కథ తేలుస్తానని.. విచారణ ఎదుర్కొనక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కు గులాంగిరి చేయటం మానాలంటూ హితవు పలికారు. రేవంత్ దూకుడు పోలీసులకు ఒక పట్టాలన వంట బట్టటం లేదన్న మాట వినిపిస్తోంది.