Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ అవినీతిని నేను నిరూపిస్తా .. రేవంత్‌రెడ్డి సవాల్‌

By:  Tupaki Desk   |   11 Nov 2021 3:30 PM GMT
కేసీఆర్‌ అవినీతిని నేను నిరూపిస్తా .. రేవంత్‌రెడ్డి సవాల్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి పై మీరు సీబీఐ విచారణకు ఆదేశించండి. ఆయన అవినీతిని నేను నిరూపిస్తా. నిరూపించలేని పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అవినీతిని బయటపెట్టే ధైర్యం తనకుందని.. అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ బండి సంజయ్‌ ఇప్పిస్తాడా? అని ప్రశ్నించారు. కొంపల్లిలో మంగళవారం ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ శిక్షణా తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ కేసీఆర్‌, బండి సంజయ్‌ ప్రెస్‌ మీట్లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్‌ ను తలపిస్తున్నాయని తీవ్రమైన విమర్శలు చేశారు.

బండి సంజయ్‌పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. భాజపా, తెరాస డ్రామా ఆడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని ఆరోపించారు. నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్‌ రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆయన అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్‌ రూ.వెయ్యికోట్ల అవినీతి చేశారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా సీబీఐ విచారణ వేయించండి.

కేసీఆర్‌ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రేవంత్‌ అన్నారు. బండి సంజయ్‌ను 6 ముక్కలు చేస్తానని కేసీఆర్‌ బెదిరిస్తుంటే.. బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. నెక్లెస్‌ రోడ్డులోని సంజీవయ్య పార్కును మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఆక్రమించారని, దీనిపై విచారణకు ఆదేశించే ధైర్యం బీజపీకి ఉందా అని ప్రశ్నించారు. ట్యాంక్‌ బండ్‌ పై అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.