Begin typing your search above and press return to search.

హైటెక్ సిటీలో ఆరాచ‌కం..వేదిక‌ను త‌గ‌లెట్టేశారు!

By:  Tupaki Desk   |   1 Jan 2019 5:45 AM GMT
హైటెక్ సిటీలో ఆరాచ‌కం..వేదిక‌ను త‌గ‌లెట్టేశారు!
X
విశ్వ‌న‌గ‌రంగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న హైద‌రాబాద్‌లో ఆరాచ‌కం అంత‌కంత‌కూ పెరుగుతోంది. వ‌ర‌ల్డ్ క్లాస్ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దాల‌న్న ఆకాంక్ష‌ల‌కు బ్రేకులు వేసేలా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల‌కాలంలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే.. ఆరాచ‌కం ఈస్థాయిలోనా? అన్న ఆందోళ‌న‌కు గురి కావ‌టం ఖాయం.

పోలీసుల‌పై దాడి చేసే దుర్మార్గంతో పాటు.. ప‌వ‌ర్ ను అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే కొంద‌రి తీరు ఈ మ‌ధ్య‌న వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజాగా న్యూఇయర్ సెల‌బ్రేష‌న్ల‌లో భాగంగా హైటెక్ సిటీగా పేరొందిన మాదాపూర్ లో చోటు చేసుకున్న వైనం వింటే అవాక్కు అవ్వాల్సిందే.

కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తిస్తూ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఏర్పాట్లు స‌రిగా లేవ‌న్న ఆగ్ర‌హంతో కొంద‌రు యువ‌కులు.. వేదిక‌ను త‌గ‌ల‌బెట్టేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ ఘ‌ట‌న మారుమూల ప్రాంతంలో కాకుండా.. మాదాపూర్ లాంటి ప్రైమ్ లొకాలిటీలో చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

సోమ‌వారం రాత్రి మాదాపూర్ సిద్దివినాయ‌క న‌గ‌ర్‌ లోని క్రికెట్ గ్రౌండ్‌ లో న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ల‌ను నిర్వ‌హించారు. వేడుక‌లు షురూ అయిన కాసేప‌టికి ఏర్పాట్లు స‌రిగా లేవ‌న్న ఆగ్ర‌హాన్ని కొంద‌రు యువ‌కులు వ్య‌క్తం చేశారు. వేడుక‌లు మొద‌లైనా త‌మ‌కు ఇవ్వాల్సిన డ్రింక్ స‌రిగా ఇవ్వ‌టం లేద‌ని.. డీజే కూడా బాగా లేదంటూ నిర్వాహ‌కులపై కొంద‌రు యువ‌కులు ఫైర్ అయ్యారు.

టేబుళ్ల‌ను.. కుర్చీల‌ను ఎత్తి పారేయ‌ట‌మే కాదు.. మ‌ద్యం సీసాల‌ను వేదిక‌పైకి విసిరారు. దీంతో.. వేదికకు ఒక్క‌సారి నిప్పు అంటుకుంది. మ‌ద్యం కార‌ణంగా మంట‌లు మ‌రింత‌గా పెరిగాయి. ఏం జ‌రుగుతుందో అర్థం కాక‌పోవ‌టం.. మంట‌ల తీవ్ర‌త పెర‌గ‌టంతో ఆందోళ‌న‌కు గురైన అతిధులు బెంబేలెత్తారు.

ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే స్పందించిన మాదాపూర్ పోలీసులు కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న చోట‌కు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పివేశారు. గొడ‌వ చేసిన యువ‌కుల్ని చెద‌ర‌గొట్టారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు న‌ష్టం వాటిల్లేలా చేయ‌ట‌మే కాదు.. కొత్త త‌ర‌హా విధ్వంస ర‌చ‌న‌కు స్పూర్తినిచ్చిన‌ట్లు అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌నులు చేసిన వారు ఎవ‌రైనా.. ఏ స్థాయి వారిపైనైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు.