Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఆ సేవ‌లు 100 రోజులు బంద్‌

By:  Tupaki Desk   |   14 Sep 2017 5:31 AM GMT
తెలంగాణ‌లో ఆ సేవ‌లు 100 రోజులు బంద్‌
X
సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. కీల‌క‌మైన అంశాల్లో ధైర్యంగా డెసిష‌న్స్ తీసుకోవ‌టానికి ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని కేసీఆర్‌.. ఈ మ‌ధ్య‌నే అలాంటి నిర్ణ‌యం ఒక‌టి తీసుకోవ‌టం తెలిసిందే. కొన్ని ద‌శాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్ని అప్‌గ్రేడ్ చేయ‌క‌పోవ‌టం.. ల్యాండ్ రికార్డుల్ని చెక్ చేయ‌టం లాంటివేమీ చేయ‌ని విష‌యం తెలిసిందే. దీంతో ఎవ‌రికి వారు భూముల రికార్డుల్ని టాంప‌ర్ చేసేసి పెద్ద ఎత్తున భూఅక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.

భూదందాల‌కు చెక్ చెప్పే అంశంపై దృష్టి సారించిన కేసీఆర్‌.. మొత్తంగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని 30 క‌లెక్ట‌రేట్లు (హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ మిన‌హాయించి).. 66 రెవెన్యూ డివిజ‌ట‌న్లు (హైద‌రాబాద్‌.. సికింద్రాబాద్ కాకుండా).. 568 త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లో రోజువారీగా అందించే రెవెన్యూ సేవ‌ల‌కు 100 రోజుల పాటు బంద్ చేయ‌నున్నారు.

ఈ రోజు (గురువారం) త‌ర్వాత మూడున్న‌ర నెల‌ల పాటు కుల ధ్రువీక‌ర‌ణ మొద‌లుకొని.. త‌హ‌సీల్దార్ ఆఫీస్‌.. మీ సేవ కేంద్రాల నుంచి అందుకునే ఏ సేవ‌కైనా 100 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. ఈ నెల 15 నుంచి త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌న్నీ అన‌ధికారికంగా మూత‌ప‌డ‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. రెవెన్యూ రికార్డుల అప్ గ్రేడ్ చేసేందుకు రానున్న వంద రోజుల పాటు గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

దీంతో రోజువారీగా అందించే సేవ‌లు కుల.. ఆదాయ..స్థానిక‌త‌కు సంబంధించిన సేవ‌ల‌తో పాటు అడంగ‌ల్ స‌హాణీలు.. ల్యాండ్ క‌న్వ‌ర్జ‌న్‌.. లేట్ రిజిస్ట్రేష‌న్.. బ‌ర్త్‌.. డెత్‌.. ఈ పాస్ పుస్త‌కం.. కాస్రా ప‌హాణీ.. చేసాల ప‌హాణీ.. పైస‌ల్ ప‌ట్టి.. రుణ అర్హ‌త కార్డులు..సినిమా లైసెన్స్ రెన్యువ‌ల్‌.. ఓఆర్ సీ.. బోర్ల కోసం అనుమ‌తులు.. అడంగ‌ల్ ను స‌రిచేయ‌టం లాంటి సేవ‌ల‌న్నింటికి బ్రేకులు ప‌డ‌నున్నాయి.

రెవెన్యూ సిబ్బంది అంతా శుక్ర‌వారం నుంచి గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. హైద‌రాబాద్ జిల్లాల్లోని 16 మండ‌లాలు మిన‌హాయించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మండ‌లాల్లోనూ భూస‌ర్వేల‌ను నిర్వ‌హించ‌నున్నారు. వీఆర్వో నుంచి డిప్యూటీ త‌హ‌సీల్దార్ వ‌ర‌కూ అంద‌రూ గ్రామాల్లోనే బ‌స చేయ‌నున్నారు. దీంతో.. రెవెన్యూ సేవ‌ల్ని అందించేందుకు ఏమాత్రం అవ‌కాశం లేద‌ని రెవెన్యూ సిబ్బంది స్ప‌ష్టం చేస్తున్నారు. సో.. రెవెన్యూ సేవ‌లు రేప‌టి (శుక్ర‌వారం) నుంచి వంద రోజుల పాటు ఆగిపోనున్నాయి.