Begin typing your search above and press return to search.

రూ.30కోట్ల లంచం అడిగిన మంత్రి పీఏ

By:  Tupaki Desk   |   14 May 2016 4:08 PM GMT
రూ.30కోట్ల లంచం అడిగిన మంత్రి పీఏ
X
అమ్యామ్యాల స్థాయి ఎంతలా పెరిగిందనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనం. ఏదైనా పని చేసి పెట్టాలని అడిగితే పదో పరకో అడగటం జమానా మాట. అది పోయి లక్షల వరకూ చేరుకుందన్న రోజులు నడుస్తున్నాయని భావిస్తున్న వేళ.. పని చేసి పెట్టటానికి కోట్లు అడిగే స్థాయికి చేరుకుందన్న వైనం షాకింగ్ గా మారింది. తన భూమికి ఎన్ వోసీ అడిగిన ఒక ప్రముఖుడ్ని.. మంత్రిగారి పీఏగా చెప్పుకుంటున్న వ్యక్తి అడిగిన లంచం ఎంతో తెలుసా? జస్ట్ రూ.30 కోట్లు మాత్రమే. సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

ప్రఖ్యాత ఆర్థికవేత్త రమేశ్ జాదవ్ తన భూమికి సంబంధించిన ఎన్ వోసీ ఇవ్వాలంటూ మహారాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే కార్యాలయాన్ని సంప్రదించాడు. ఇక్కడ మంత్రి పీఏగా చెప్పుకునే గగన్ జన్ పాటిల్ రూ.30కోట్లు లంచం అడిగారు. దీంతో ఒళ్లు మండిన జాదవ్ ఏసీబీకి ఫిర్యాదు చేయటం.. ప్లాన్ ప్రకారం అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ వ్యవహారం రచ్చకు ఎక్కటంతో మంత్రిగారి సీన్లోకి వచ్చేసి.. పీఏగా చెప్పుకుంటున్న వ్యక్తి కార్యకర్తగా మాత్రమే తెలుసని.. తన నియోజకవర్గంలోని వారిని చికిత్స కోసం ముంబయికి తీసుకొస్తాడని.. అతడు తన పీఏ కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. లెక్క తేడా వచ్చినప్పుడు సన్నిహితులు కాస్తా.. పరిచయస్తులుగా మారటం మామూలేగా.