Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఎల్‌టీటీఈని పున‌రుద్ధ‌రిస్తున్నారా?

By:  Tupaki Desk   |   21 July 2022 5:30 PM GMT
మ‌ళ్లీ ఎల్‌టీటీఈని పున‌రుద్ధ‌రిస్తున్నారా?
X
శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు తమిళనాడులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. త‌మిళ‌నాడులోని మొత్తం 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింద‌ని స‌మాచారం.

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌వాది హాజీ సలీమ్‌ సహకారంతో.. గుణ‌శేఖ‌ర‌న్, పుష్పరాజన్‌లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్‌ మాఫియా అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌, ఆయుధాలను ఈ మాఫియా భారత్ లోకి చేర‌వేసి సరఫరా చేస్తున్నట్లు వెల్ల‌డించారు. లిబరేష‌న్ టైగర్స్ ఆఫ్‌ తమిళ్‌ ఈలం(ఎల్‌టీటీఈ)ని పునరుద్ధరించటం, హింసాత్మక కార్యక్రమాలను పెంచటమే ఈ ఉగ్ర‌వాదుల లక్ష్య‌మ‌ని వివ‌రిస్తున్నారు.

శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009, మేలో ఎల్‌టీటీఈ అధినేత ప్ర‌భాక‌ర‌న్ ను అంత‌మొందించ‌డంతో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్‌ మద్దతు తెలిపింది. సామాన్య ప్రజలపై ఎల్‌టీటీఈ సాగించిన మారణకాండపై విచారం వ్యక్తం చేసింది. కాగా ఎల్‌టీటీఈ తీవ్ర‌వాదులు 1990లో మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీని మాన‌వ బాంబు ద్వారా త‌మిళనాడులోనే హత్య చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఎన్ఐఏ అధికారులు త‌మిళనాడులోని చెన్నై, తిర్పూర్, చెంగళ్‌పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని పలువురు నిందితుల ఇళ్లు, పరిసరాల్లో సోదాలు చేపట్టారు . ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరాపై సుమోటోగా కేసు న‌మోదు చేసిన‌ ఎన్‌ఐఏ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్‌ సర్వీసెస్‌, నేరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో ఆయుధాల సరఫరాపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది.