Begin typing your search above and press return to search.

భ‌ట్టికి రేవంత్ ఫుల్ స‌పోర్టు..!

By:  Tupaki Desk   |   5 March 2022 2:30 PM GMT
భ‌ట్టికి రేవంత్ ఫుల్ స‌పోర్టు..!
X
సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌కు పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ ఫుల్ స‌పోర్టు ఇచ్చారా..? భ‌ట్టి పాద‌యాత్ర పార్టీ అధిష్ఠానం అనుమ‌తితోనే జరుగుతోందా..? రేవంత్ స‌హ‌కారంతోనే భ‌ట్టి ముందుకు సాగుతున్నారా..? వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు గాలి బుడ‌గ‌లేనా..? అంటే పార్టీ శ్రేణులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ధిర నుంచి భ‌ట్టి విక్ర‌మార్క వారం రోజుల క్రితం పాద‌యాత్ర ప్రారంభించారు.

ఈ పాద‌యాత్ర నెల రోజుల పాటు సాగుతుంద‌ని.. దాదాపు ఐదు వంద‌ల కిలోమీట‌ర్ల మేర భ‌ట్టి న‌డుస్తార‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌భుత్వం ఏమేం హామీలు ఇచ్చింది..? రైతుల స‌మస్య‌లు, నిరుద్యోగుల ఖాళీలు, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు.., ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంపిణీ.. వంటి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను త‌న పాద‌యాత్ర ద్వారా లేవ‌నెత్తుతున్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా.. త్వ‌ర‌లో ఖ‌మ్మం జిల్లా మొత్తంతో పాటు రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తానని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డ‌తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. భ‌ట్టి పాద‌యాత్ర త‌న వ్య‌క్తిగ‌త ఎజెండాగా రూపొందించుకున్నార‌ని.. పార్టీ అధిష్ఠానానికి గానీ.. అధ్య‌క్షుడు రేవంత్ కు గానీ మాట మాత్రం కూడా చెప్ప‌కుండా హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని తొలుత ఆరోప‌ణలు వ‌చ్చాయి.

భ‌ట్టి విక్ర‌మార్క కూడా త‌న పాద‌యాత్ర తొలి రోజు ఇదే అంశాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. సీఎల్పీ హోదాలో రాష్ట్రం మొత్తం తిరిగే హ‌క్కు త‌న‌కుంద‌ని.. త‌న‌ను ఎవ‌రూ అడ్డుకోలేర‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది. రేవంత్ కు, భ‌ట్టికి మ‌ధ్య దూరం బాగా పెరిగింద‌నే సందేహాలు వ‌చ్చాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను.. సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేశారు రేవంత్ స‌న్నిహితులు. ఈ అంశంపై రేవంత్ బ‌య‌టికి ఏం చెప్ప‌క‌పోయినా త‌న చ‌ర్య‌ల ద్వారా ప‌రోక్షంగా భ‌ట్టికి మ‌ద్ద‌తు ప‌లికారు.

అదెలాగంటే.. భ‌ట్టి పాద‌యాత్ర‌లో ఈ ఆరు రోజులూ కేవ‌లం ఆయ‌న స‌న్నిహితులు, అనుచ‌రులు, జిల్లా ముఖ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. తాజాగా భ‌ట్టికి రేవంత్ స‌న్నిహితులు జ‌త క‌లిశారు. రేవంతుకు మ‌ద్ద‌తుగా మొద‌టి నుంచీ అండ‌గా ఉంటున్న మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌, వేం న‌రేంద‌ర్ రెడ్డి, బెల్ల‌య్య నాయ‌క్ ఇత‌ర ముఖ్య నేత‌లు భ‌ట్టితో పాటు కొద్ది దూరం పాద‌యాత్ర నిర్వహించి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఎవ‌రు పాద‌యాత్ర నిర్వ‌హించినా స‌మ్మ‌త‌మేన‌ని.. పార్టీ బ‌లోపేత‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని రేవంత్ ఈ చ‌ర్య‌ల ద్వారా తెలియ‌జేశారు. మ‌రి రేవంత్ పాద‌యాత్ర ఎప్పుడు ఉంటుందో వేచి చూడాలి.