Begin typing your search above and press return to search.

అఫీషియ‌ల్‌: టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:06 PM GMT
అఫీషియ‌ల్‌: టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌
X
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక‌పై కొద్ది రోజులుగా నెల‌కొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్ట‌కేల‌కు ఈ రోజు ఏఐసీసీ తెర‌దించింది. ఎంతో మంది పోటీలో ఉన్నా, సీనియ‌ర్ నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసినా కూడా వాటిని ప‌క్క‌న పెట్టేసి టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌ రెడ్డి ని ఎంపిక చేసింది. దీనిపై ఎన్ని అభ్యంత‌రాలు వ‌చ్చినా, ఎంతో మంది సీనియ‌ర్లు గ‌గ్గోలు పెట్టినా కూడా చివ‌ర‌కు ఏఐసీసీ రేవంత్‌కే తెలంగాణ‌ లో పార్టీని గాడిన పెట్టే బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ప్రస్తుతం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియ‌మించింది. ఈ ఐదుగురిలో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు బ్యాలెన్స్ చేసిన‌ట్టు గా అనిపించింది. మైనార్టీ వ‌ర్గం నుంచి భార‌త మాజీ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌, మొరాదాబాద్ మాజీ ఎంపీ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, యాద‌వ వ‌ర్గం నుంచి మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, గౌడ వ‌ర్గం నుంచి బి. మ‌హేష్‌కుమార్ గౌడ్, ఎస్సీల నుంచి మాజీ మంత్రి జె. గీతారెడ్డి, ఇక రెడ్డి వ‌ర్గం నుంచి టైగ‌ర్ జ‌గ్గారెడ్డి కి ఈ ప‌ద‌వులు ద‌క్కాయి.

ఉపాధ్య‌క్షులుగా మాజీ ఎమ్మెల్యే సంబాని చంద్ర‌శేఖ‌ర్ రావు, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోదెం వీర‌య్య‌, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌, మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డి, ర‌మేష్ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజ‌న్‌, టి. కుమార్ రావు, జావెద్ అమీర్‌ల‌ను నియ‌మించారు. ప్ర‌చార క‌మిటీకి మాజీ ఎంపీ మ‌ధుయాష్కి చైర్మ‌న్‌గా ఉంటారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీకి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా చైర్మ‌న్‌గా నియ‌మితులు అయ్యారు. ఏదేమైనా ఏఐసీసీ ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన వెంట‌నే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేవంత్ అనుచ‌రులు సంబ‌రాలు షురూ చేసుకుంటున్నారు.

అయితే పీసీసీ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నేత‌లు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి వాళ్ల నుంచి రేవంత్‌కు ఎలాంటి స‌హ‌కారం ఉంటుందో ? చూడాలి. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన రేవంత్‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డం పార్టీలో సీనియ‌ర్లు, ఇత‌ర నేత‌ల్లో కూడా చాలా మంది జీర్ణించుకోలేక‌పోతున్నారు.