Begin typing your search above and press return to search.

అయ్య‌య్యో.. అప్పుడే సెగ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   17 Nov 2021 9:55 AM GMT
అయ్య‌య్యో.. అప్పుడే సెగ మొద‌లైందా?
X
రాజ‌కీయాల్లో అడుగుపెట్టినంత సుల‌భం కాదు ఇక్క‌డ ప్ర‌యాణం సాగించ‌డం. రాజ‌కీయ ప్ర‌వేశంతోనే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట ప‌డని వాళ్లు కూడా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ‌కీయాలంటే ప‌ద‌వులే కాదు.. తిట్లు కూడా ఉంటాయి. ఈ విష‌యం సిద్ధిపేట మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డికి తొలిరోజే అనుభ‌వంలోకి వ‌చ్చింది. త‌న ప‌ద‌వి నుంచి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని టీఆర్ఎస్‌లో చేరి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ఆయ‌న మొదటి రోజు నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

మ‌రో ఏడాది స‌ర్వీస్ ఉన్న‌ప్ప‌టికీ త‌న ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న వెంక‌ట్రామిరెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కావ‌డం ఖాయ‌మైంది. ఎమ్మెల్సీ కోటాలో ఆయ‌న పేరును కేసీఆర్ ఎంపిక చేశారు. పోటీ లేక‌పోవ‌డంతో ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది. దీంతో రెండు రోజుల క్రితం ఓ క‌లెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ కాబోతున్నారు. అంతే కాకుండా ఆయ‌న్ని కేసీఆర్ మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. ఇలా రాజ‌కీయాల్లోకి రాగానే ప‌ద‌వి యోగం పట్టింద‌నే ఆనందంలో ఉన్న ఆయ‌న‌కు.. అప్పుడే సెగ మొద‌లైంది. ఆయ‌న‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మంట పెట్టారు. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రాల‌ను తిరస్క‌రించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను రేవంత్ కోరారు.

అవినీతి, అక్ర‌మాల‌తో పాటు ఐఏఎస్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు సంబంధించి గ‌తంలో ఆయ‌న‌పై రాష్ట్రప‌తికి కేంద్ర ప్ర‌భుత్వానికి చేసిన ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. విచార‌ణ జ‌రిగి చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాల‌ని కోరారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమ స‌మ‌యంలో తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన వెంక‌ట్రామిరెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా ఎలా మారారో? చెప్పాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయ‌న్ని శిక్షించేంత‌వ‌ర‌కూ న్యాయ పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్ బంట్రోతుగా వెంక‌ట్రామిరెడ్డి ప‌నిచేశార‌ని ఔట‌ర్ రింగ్‌రోడ్డును అష్ట వంక‌ర‌లు తిప్ప‌డంలో ఆయ‌న పాత్ర ఉంద‌ని రేవంత్ తీవ్ర విమర్శ‌లు చేశారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ లేదా వెంక‌ట్రామిరెడ్డి నుంచి కానీ ఎలాంటి కౌంట‌ర్ వ‌స్తుందో చూడాలి.