Begin typing your search above and press return to search.

సోమిరెడ్డికి వ‌ర్మ అదిరిపోయే రిటార్ట్‌!

By:  Tupaki Desk   |   11 Oct 2017 3:34 PM GMT
సోమిరెడ్డికి వ‌ర్మ అదిరిపోయే రిటార్ట్‌!
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించ‌బోతున్న‌ 'లక్ష్మీస్ ఎన్టీఆర్ ' సినిమాపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వెనుక వైసీపీ హ‌స్తం ఉంద‌ని, అందుకే ఆ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి....ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌పై సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర్మ‌...ప‌నీ పాటా లేని వ్య‌క్త‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. నిత్యం వివాదాల్లో ఉండ‌డం వ‌ర్మ‌కు అల‌వాట‌ని, ఆయ‌న తీసిన సినిమాలు హిట్టయ్యేలా చూసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్భంగా ఆయ‌న ల‌క్ష్మీ పార్వ‌తిపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.

వ‌ర్మ మంచి సందేశాత్మక సినిమాలు, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందే సినిమాలు తీయాల‌ని సోమిరెడ్డి సూచించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను వ‌ర్మ‌ తీయడం సంతోషకరం. ఆ సినిమా తీయ‌డం పై మాకేమీ అభ్యంత‌రం లేదు. లక్ష్మీపార్వతి పెద్ద త్యాగమూర్తి అనే అభిప్రాయం వ‌ర్మ‌కు వ‌చ్చింది. ఆమె త్యాగాల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించ‌మనండి. ఆమె ప్ర‌వేశం మ‌హానుభావుడు ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెట్టింది. ఆ సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఆమెనే పెట్టుకోమనండి. మాకు ఎటువంటి అభ్యంత‌రం లేదు అంటూ సోమిరెడ్డి....వ‌ర్మ‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా లక్ష్మీ పార్వతినే పెట్టుకోమ‌న్న‌ సలహాకు రిటార్ట్ ఇచ్చారు. మీ ఉచితకు సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా అంటూ సోమిరెడ్డికి వర్మ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేశారు. ఆ చిత్రాన్ని వర్మ తీయ‌డం వ‌ల్ల న‌ష్ట‌మేమీ లేద‌ని, అది కేవ‌లం సినిమా మాత్రమేన‌ని అన్నారు. సినిమా గురించి తాను మాట్లాడేదేముంటుంద‌ని, తాను ప్రజాసమస్యలపై మాత్రమే స్పందిస్తానని లోకేశ్ చెప్పారు.