Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వర్మ.. ధర్మ సందేహం!

By:  Tupaki Desk   |   25 May 2019 11:41 AM GMT
రామ్ గోపాల్ వర్మ.. ధర్మ సందేహం!
X
'ఎన్నికల ముందు అంతగా తిట్టుకున్నారు కదా.. ఇప్పుడు తమ ప్రత్యర్థులు గెలిస్తే ఇంత పాలీష్డ్ గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు ఎన్నికల ముందు దూషించుకున్న తీరును బట్టి.. ఇప్పుడు మీ ప్రత్యర్థులకు ఓట్లు వేసిన ప్రజలను మీరు ఎలా తిట్టుకోవాలో తెలుసా..' అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు. తిక్కలోడిలా కనిపించే మేధావి రామ్ గోపాల్ వర్మ అని సోషల్ మీడియా ఊరికే అనదు!

రామ్ గోపాల్ వర్మ వ్యక్త పరిచిన ఈ ధర్మ సందేహం చాలా విలువైనది! ఈ ఎన్నికలనే తీసుకుంటే.. పోలింగ్ ముందు వరకూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు జగన్ విషయంలో ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎంత తీవ్రంగా దూషించారంటే.. ఆ మాటలను ఇప్పుడు గుర్తు చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంత దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు.

అనంతపురం లో ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. జగన్ మీద అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. 'నువ్వు ఎలా సీఎం అవుతావో చూస్తా జగన్ మోహన్ రెడ్డి' అనేంత లెవల్లో చాలెంజ్ చేశాడు పీకే!

తీరా ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. ప్రజలు అలాంటి తీర్పును ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'ప్రజా తీర్పును గౌరవిస్తాం..' అన్నట్టుగా మాట్లాడారు. ఈ అంశాన్నే ఆర్జీవీ ప్రస్తావించాడు. అప్పుడు అన్ని మాటలు అన్నారు కదా.. ఇప్పుడు ప్రజల తీర్పును మీరెలా గౌరవిస్తారు? మీరు పోలింగ్ ముందు చెప్పిన మాటలు నిజమే అయితే ఇలాంటి తీర్పును ఇచ్చిన ప్రజలను మీరు తిట్టాలి కదా.. అన్నట్టుగా ఆర్జీవీ అంటున్నాడు. చాలా ధర్మంగానే ఉంది ఈ సందేహం. దీనికి రాజకీయ నేతలే సమాధానం ఇవ్వాలి!