Begin typing your search above and press return to search.

కమ్మ రాజ్యంలో కడప రెడ్ల మూవీ అప్డేట్ తో వర్మ సంచలనం

By:  Tupaki Desk   |   8 Aug 2019 10:48 AM GMT
కమ్మ రాజ్యంలో కడప రెడ్ల మూవీ అప్డేట్ తో వర్మ సంచలనం
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ హాట్ టాపిక్ గా మారిన రాంగోపాల్ వర్మ.. గడిచిన కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ఆయన మౌనంగా ఉంటున్నారంటే.. ఆయన ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నట్లే. ఎన్నికలకు కాస్త ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆయన.. ఆ సందర్భంగా ఆయన సంచలనాల మీద సంచలనాలు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయటంలో చంద్రబాబు ఎంత కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని ఇప్పటి తరానికి తన సినిమాతో కళ్లకు కట్టేలా చేశారు. నిజానికి ఈ సినిమాతో చంద్రబాబుకు జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువని చెబుతారు.

గతంలో జరిగిన వెన్నుపోటు ఎలా జరిగిందన్న విషయాన్ని విజువలైజ్ చేసి.. తెర వెనుక జరిగినట్లుగా చెప్పిన అంశాల్లపై చాలానే డిబేట్ నడిచినా..అంతిమంగా వర్మ సినిమా చూపించిన ప్రభావం బాబు ఓటమికి కారణంగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో జగన్ విజయం తర్వాత ఆయన అనూహ్యంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో సినిమాను ప్రకటించి సంచలనంగా మారారు. తన సినిమా అన్నంతనే వివాదాలు గుర్తుకు తెచ్చే వర్మ.. తన తాజా సినిమాను మాత్రం అత్యంత వివాదరహితమైన సినిమాగా అభివర్ణించటం గమనార్హం.

ఎప్పటికప్పుడు తనకు వచ్చిన ఆలోచనలతో అప్పటికప్పుడు సినిమాలు ప్రకటించే వర్మ..కొన్ని సినిమాల్ని ఏళ్లు ఏళ్లు అయినా పట్టించుకోరు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కూడా అదే కోవకే చెందుతుందన్న భావనలో ఉన్న వేళ.. అనూహ్యంగా ఈ చిత్రానికి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ను ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ సాంగ్ ను రేపు (శుక్రవారం) ఆగస్టు 9న ఉదయం 9 గంటల వేళలో విడుదల చేయనున్నట్లు ప్రకటించటం ద్వారా.. అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేశారని చెప్పాలి. అంతేకాదు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తానని చెప్పారు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చెప్పటం ద్వారా వర్మ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా కథ ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? భవిష్యత్తులో ఏం జరగనుందన్న విషయాల్ని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. తన తాజా చిత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాదాస్పదంగా ఉండదని హామీ ఇవ్వటం గమనార్హం. ఇలాంటి హామీని వర్మ ఇప్పటివరకూ ఏ సినిమాకు ఇవ్వకపోవటాన్ని మర్చిపోకూడదు.

తన తాజా చిత్రం సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) మీద తీస్తున్న సినిమాగా వర్మ వెల్లడించారు. చంద్రబాబును వర్మ సీబీఎన్ గా పిలుస్తుంటారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వెన్నుపోటు సాంగుతో చంద్రబాబుకు షాకిచ్చిన వర్మ.. తాజా చిత్రంలో మరెలాంటి షాకిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఇక.. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చాలా చిత్రంగా జరిగిందని చెప్పాలి.

వైఎస్ విజయం తర్వాత విజయవాడలో రాయలసీమ రెడ్లు కనిపించారని.. సుమోలు.. తెల్లటి పంచెలతో నేతలు అధికంగా కనిపించారని.. అదంతా చూసినప్పుడు తాను రాయలసీమలో తిరిగినట్లుగా అనిపించినట్లు వర్మ చెప్పుకున్నారు. ఏపీలోని రెండు బలమైన సామాజిక వర్గాలైన కమ్మలు.. రెడ్లను ప్రధాన పాత్రలుగా చూపించే ఈ సినిమా టైటిలే వివాదంగా ఉన్నప్పుడు సినిమా మరెంత వివాదంగా ఉంటుందన్న ప్రశ్నను కొందరు వేస్తున్నారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడకు వచ్చిన సందర్భంగా విజయవాడలోని గేట్ వే హోటల్ మొత్తం రాయలసీమ వారితో నిండిపోయిందని.. అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని అప్పట్లో వర్మ చెప్పుకున్నారు. ఏమైనా.. వివాదాల్నిజేబులో పెట్టుకొని తిరిగే వర్మ.. తాజాగా చిత్రంతో మరెంత హాట్ టాపిక్ గా మారతారన్నది టైటిల్ సాంగ్ అంతో ఇంతో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు.