Begin typing your search above and press return to search.

తెలంగాణలో ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే..

By:  Tupaki Desk   |   14 Dec 2018 10:15 AM GMT
తెలంగాణలో ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే..
X
తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. గెలిచిన టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుండగా.. ఓడిన కాంగ్రెస్ బాధపడుతోంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు, అప్పులు బయటకు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ గణంకాలను బయటపెట్టింది.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య వందకుపైగానే ఉందని ఏడీఆర్ సంస్థ బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో 106మంది కోటీశ్వరులున్నట్లు లెక్కతేల్చింది. ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.15.71కోట్లుగా తేల్చింది. గడిచిన దఫా అసెంబ్లీలో 83మంది మాత్రమే కోటీశ్వరులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది.

కొత్తగా ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల్లో అత్యధిక ఆస్తి కలిగిన నేతగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారు. ఆయన అఫిడవిట్ లో ప్రకటించిన ఆస్తి ఏకంగా రూ.314.31కోట్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 161.29 కోట్లతో నిలిచారు.., కాంగ్రెస్ ఎమ్మెల్యే కే. ఉపేందర్ రెడ్డి రూ.91.37 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు తెలంగాణలోనే అత్యంత ధనవంతులుగా స్థానాలు నిలబెట్టుకున్నారు.

ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన టీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ నిలిచారు. ఈయన ఆస్తి కేవలం రూ.11.23 లక్షలు మాత్రమే. ఇక కింది నుంచి చూస్తే రెండో అత్యంత పేద ఎమ్మెల్యేగా ఎంఐఎం శాసనసభ్యుడు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ నిలిచారు.. ఈయన ఆస్తి రూ.19.75లక్షలుగా ఉంది. ఇక మూడో పేద ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు.. ఈయన ఆస్తి రూ.27.60 లక్షలు.

ఇక అత్యంత అప్పులు కలిగిన నేతలు కూడా తెలంగాణ అసెంబ్లీలో ఉండడం విశేషం. ఎమ్మెల్యే కే. ఉపేందర్ రెడ్డి తన అప్పును రూ.94.58 కోట్లుగా చూపించారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అప్పులు రూ.63.14 కోట్లుకాగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అప్పులు రూ.40.72 కోట్ల అప్పులు చూపించారు.