Begin typing your search above and press return to search.

రింగింగ్ బెల్ కూడా ఆ బాప‌తేనా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 5:35 AM GMT
రింగింగ్ బెల్ కూడా ఆ బాప‌తేనా?
X
మార్కెట్లో నాలుగు వేల రూపాయిలు పెడితే కానీ రాని స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ.251ల‌కే సొంతం చేసుకోవ‌చ్చంటూ రింగింగ్ బెల్ అనే కంపెనీ చేసిన ప్ర‌క‌ట‌న ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌రికొద్ది గంట‌ల్లో బుకింగ్స్ స్టార్ట్ చేస్తామంటూ బుధ‌వారం ఉద‌యం స‌ద‌రు కంపెనీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తే.. బుకింగ్స్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి కోట్లాది మంది ఫోన్ బుక్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గూగుల్ కు మించి సెక‌న్ కు 6 ల‌క్ష‌ల మంది విజిట‌ర్స్ త‌మ వెబ్ సైట్ కు వ‌చ్చార‌ని.. దీంతో త‌మ సైట్ క్రాష్ అయ్యిందంటూ స‌ద‌రు సంస్థ పేర్కొంది.

రింగింగ్ బెల్స్ చెప్పిన‌ట్లుగా రూ.251 ఫోన్ ను బుక్ చేసుకునేందుకు కోట్లాదిమంది ట్రై చేసినా.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా త‌మ బుకింగ్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింద‌న్న మాట చెప్పింది లేదు. ఇక‌.. సోష‌ల్ మీడియాలో అయితే.. ఈ ఫోన్ బుకింగ్ కోసం చేసిన ప్ర‌య‌త్నాల్ని క‌థ‌లు.. క‌థ‌లుగా చెప్పుకోవ‌ట‌మే కాదు.. క‌డుపు మండి వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌రిస్థితి.
దేశ‌వ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ఈ కంపెనీ య‌వ్వారంపై ఇప్పుడు చాలానే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లీ కంపెనీ ఫోన్ల‌ను డెలివ‌రీ చేస్తుందా? లేదా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఈ ఫోన్ బుకింగ్ గురించి పాజిటివ్ గా ఒక్క‌రు మాట్లాడ‌కున్నా.. తాము మాత్రం 30వేల బుకింగ్ లు తీసుకున్న‌ట్లుగా సద‌రు కంపెనీ చెబుతోంది.

కంపెనీ మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య లింకు స‌రిగా కుద‌ర‌ని నేప‌థ్యంలో.. పాత ముచ్చ‌ట్ల‌ను ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. రింగింగ్ బెల్స్ విష‌యంలో ఇప్పుడు ఎంత సంద‌డి నెల‌కొందో.. కొన్నేళ్ల కింద‌ట ఆకాశ్ ల్యాప్ టాప్ ను కేవ‌లం 10 డాల‌ర్ల లోపునే ఇస్తామ‌ని స‌ద‌రు సంస్థ ఉద‌ర‌గొట్టింది. 2008లో ఆకాశ్ ట్యాబ్లెట్ల‌ను తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పి 8 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ స‌ద‌రు ధ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. ఆకాశ్ త‌యారు చేసిన ల్యాప్ టాప్ ఏకంగా 100 డాల‌ర్లుగా తేలింది. ఇక‌.. 20 డాల‌ర్ల లోపే ఆకాశ్ ట్యాబ్లెట్లు ఇస్తామ‌ని డేటావిండ్ ప్ర‌క‌టించింది. త‌న మాట‌ల‌తో ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నుంచి స‌బ్సిడీ కూడా తీసుకుంది.

ఒక‌వైపు స‌బ్సిడీ మొత్తంతో పాటు.. బుకింగ్ డ‌బ్బును కూడా స‌ద‌రు కంపెనీ తీసేసుకొని చేతులెత్తేసిన ఘ‌న చ‌రిత్ర ఉంది. ఇదే కంపెనీ ఆ మ‌ధ్య రూ.999ల‌కే సెల్ ఫోన్ అంటూ ఉద‌ర‌గొట్టేయ‌ట‌మే కాదు.. రిల‌య‌న్స్ తో జ‌ట్టు క‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించింది.ప్ర‌క‌ట‌న‌ల్లో చూపించిన జోరు.. ప‌నిలో చూపించ‌ని డేటావిండ్ మాదిరే రింగింగ్ బెల్ వ్య‌వ‌హారం ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా జ‌రిగిన ప్ర‌చారం పుణ్య‌మా అని వంద‌ల కోట్ల రూపాయిల ప్ర‌చారం ల‌భించింది. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా సుప‌రిచిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈ కంపెనీకి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు ల‌భించ‌టం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. అదే జ‌రిగితేకంపెనీకి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చాక‌.. ఖ‌రీదైన ఫోన్ల‌ను అమ్మే వీలుంది. నిజానికి ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారం.. ఇక‌పై జ‌రిగే ప్ర‌చారం ఏదీ వాస్త‌వ రూపం దాల్చ‌ద‌ని.. ఈ కంపెనీ ఎవ‌రికి రూ.251ల‌కే స్మార్ట్ ఫోన్ స‌ర‌ఫ‌రా చేయ‌దంటున్నారు. ఇప్పుడొచ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల్ని పెట్టుబ‌డులు సేక‌రించ‌టానికి స‌ద‌రు కంపెనీ పావులు క‌దిపి త‌న‌కు తాను లాభ‌ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. రింగింగ్‌ బెల్స్ తీరుపై ప‌లు కంపెనీలే కాదు.. ఇండియ‌న్ సెల్యూల‌ర్ అసోసియేష‌న్ కూడా విమ‌ర్శ‌లు చేస్తూ ఆరోప‌ణ‌లు చేస్తోంది. మ‌రి.. ఇందుకు భిన్నంగా రింగింగ్ బెల్స్.. గంట‌లు మోగుతాయో లేదో కాల‌మే స‌మాధానం చెప్పాలి.