Begin typing your search above and press return to search.

డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఫ్రీడం ?

By:  Tupaki Desk   |   28 Feb 2016 10:43 AM IST
డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఫ్రీడం ?
X
ఒక్క ప్రకటనతో దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చను రేపటమే కాదు.. కోట్లాది మంది ప్రజలు తమ గురించి మాట్లాడుకునేలా చేసుకోవటమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాలో ప్రముఖంగా కనిపించిన ఘనత రింగింగ్ బెల్స్ కంపెనీదే. ఫ్రీడం 251 అంటూ నాలుగు అమెరికన్ డాలర్ల కంటే తక్కువకే (రూపాయిల్లో రూ.251) కే స్మార్ట్ ఫీచర్లు ఇస్తానని ప్రకటించటం.. దాని బుకింగ్స్ వివరాల్ని ముందస్తుగా వెల్లడించటంతో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవటం కోసం కోట్లాది మంది ప్రయత్నించారు. అయితే.. సదరు కంపెనీ ప్రకటించిన వెబ్ సైట్ విపరీతమైన రద్దీ కారణంగా పని చేయలేదని కంపెనీ పేర్కొంది.

బహిరంగ మార్కెట్లో రూ.3 వేల నుంచి రూ.4వేల మధ్యలో ఉండే ఫోన్ ని కేవలం రూ.251 ఇవ్వటం ఏమిటంటూ విమర్శలతో పాటు.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రూ.251కి ఫోన్ పేరిట రింగింగ్ బెల్స్ మోసం చేస్తుందన్న మాటతో ఈడీ ఈ ఇష్యూ మీద దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫోన్లు బుక్ చేసుకున్న వినియోగదారులు చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయనున్నట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించింది.

ముందస్తుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న 30వేల మందికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లుగా ఫ్రీడం పేర్కొంటోంది. తమ దగ్గర బుక్ చేసుకున్న వారందరికి క్యాష్ ఆన్ డెలివరీ (డెలివరీ చేసేటప్పుడు డబ్బులు తీసుకునే పద్దతి) విధానాన్ని అనుసరిస్తామని రింగింగ్ బెల్ ఎండీ మోహిత్ గోయల్ తాజాగా చెబుతున్నారు. ఇన్ని మాటలు చెబుతున్నా.. అసలు విషయమైన ఫోన్ డెలివరీ ఎప్పుడన్న విషయాన్ని ఇప్పటికి రింగింగ్ బెల్స్ చెప్పక పోవటం గమనార్హం. ఇప్పటివరకూ ఈ కంపెనీ వ్యవహారాలపై ఈడీ కన్నేయగా.. ఇప్పుడు ఐటీ కూడా ఫోకస్ చేసింది.