Begin typing your search above and press return to search.

అక్క‌డ పీకే ఇక్క‌డ రిషి ఏం చేస్తారో ఏంటో ? ప్యాక్ అప్ పొలిటిక్స్

By:  Tupaki Desk   |   9 Jun 2022 8:50 AM GMT
అక్క‌డ పీకే ఇక్క‌డ రిషి ఏం చేస్తారో ఏంటో ? ప్యాక్ అప్ పొలిటిక్స్
X
దేవుడి నిర్ణ‌యం ఆధారంగా రాజ‌కీయాలు జ‌రుగుతాయో లేవో కానీ తెర వెనుక వ్య‌క్తుల కార‌ణంగానే వ్య‌వ‌స్థ‌లు న‌డుస్తాయి అనేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఆ మేర‌కు అటు తెలంగాణ ఇటు ఆంధ్రా ప్ర‌భుత్వాలు ఆయా వ్య‌క్తుల‌పైనే పూర్తిగా ఆధార‌ప‌డి నడుస్తున్నాయి.

అందుకే చాలా సార్లు సంబంధిత సంస్థ‌లు చెప్పిందే వేదం.. అవి ఆడిందే ఆట పాడిందే పాట కూడా అవుతున్నాయి. ఆ విధంగా సీన్ లోకి ఐ ప్యాక్ వ‌చ్చింది. ఇటు పీకే, అటు రిషి ఏక కాలంలో తెలుగు రాష్ట్రాల‌ను శాసిస్తున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే ఏక‌కాలంలో తెలుగు, త‌మిళ రాజ‌కీయాల‌నూ శాసిస్తున్నారు. ఇంకా చెబితే బెంగాల్ వ‌ర‌కూ పీకే సామ్రాజ్యం విస్త‌రించి ఉంది. సామ్రాజ్య విస్త‌ర‌ణ ఎలా ఉన్నా కేసీఆర్ కానీ, జ‌గ‌న్ కానీ ఈ హిందీవాలాల‌ను ఎందుకు న‌మ్ముకుంటున్నారో అర్థం కాక ప‌రిశీల‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

వాస్త‌వానికి పీకే కార‌ణంగానే జ‌గ‌న్ న‌వ ర‌త్నాలు ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. అటుపై అనేక సంక్షేమ ప‌థ‌కాలు వ‌చ్చి పడ్డాయి. అస‌లు ఆ రోజు న‌వ‌రత్నాలు ప్ర‌క‌టించ‌క‌పోయినా లేదా ఇత‌ర ప‌థ‌కాలు ప్ర‌క‌టించక‌పోయినా స‌రే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేవార‌ని, ఎందుకంటే పాద‌యాత్ర‌తో ఆయ‌న‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింద‌ని, అదే ఆయ‌న్ను గెలిపించేద‌ని ఇవాళ్టికీ అంటున్నారు. త‌రువాత కూడా రాష్ట్ర బ‌డ్జెట్ అన్న‌ది చూసుకోకుండా 30కి పైగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి ఖ‌జానాను నిండా ముంచారు అన్న ఆరోప‌ణ‌లు సైతం ఎదుర్కొన్నారు.

ఇప్పుడు కూడా అవే వ్యూహాల‌ను అదే వ్యూహక‌ర్త‌ల‌ను ఇటుగా తెస్తున్నారు జ‌గ‌న్. ఎందుక‌ని జ‌గ‌న్ ఈ విధంగా ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌డం అన్న‌ది పార్టీ వ‌ర్గాల నుంచే వినిపించే ప్ర‌ధాన ప్ర‌శ్న. ఇక ఐ ప్యాక్ చీఫ్ ప్ర‌శాంత్ కిశోర్ తెలంగాణ‌లోనూ త‌న ప‌నులు ఆరంభించి పలువురు సిట్టింగ్ ల‌ను త‌ప్పించే ప‌నిలో బిజీగా ఉన్నారు. స‌గానికి పైగా సిట్టింగ్ ల‌ను మార్చి, వారి స్థానంలో కొత్త వారికి ఇవ్వాల‌ని ఇప్ప‌టికే సూచ‌న‌లు చేశారు.

అంటే కేసీఆర్ కూడా ప్ర‌శాంత్ కిశోర్ ఏ చెబితే అదే చేసేందుకు సిద్ధం అవుతున్నార‌న్న‌మాట‌! మ‌రి! ఆ రోజు 2018లో ఏ ప్ర‌శాంత్ కిశోర్ ఉన్నార‌ని గెలిచారు ? లేదా అంతకుమునుపు 2014 ఎవ‌రున్నార‌ని ఎన్నిక‌లకు వెళ్లారు? నాయ‌కులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను కోల్పోయి ఈ విధంగా పీకే లాంటి స్వార్థ శ‌క్తులపై ఆధార‌ప‌డ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది ఆలోచించాల్సింది మ‌న తెలుగు ప్రాంతాల నాయ‌కులే అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.