Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్రధాని ఎన్నిక:చివరి ప్రచార స్పీచ్ లో భావోద్వేగంలో రిషి

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:22 AM GMT
బ్రిటన్ ప్రధాని ఎన్నిక:చివరి ప్రచార స్పీచ్ లో భావోద్వేగంలో రిషి
X
యావత ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించిన కీలక ఘట్టం దగ్గరకు వచ్చేసింది. ఈ నెల ఐదున ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన చివరి సభను నిర్వహించారు. ఈ సభలో ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు తమ వాదనల్ని వినిపించారు. లండన్ వెంబ్లే వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో లిజ్ ట్రస్.. రిషి సునాక్ లు తమ వాగ్ధాటిని ప్రదర్శించారు. తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని పక్కన పెడితే.. వీరిద్దరి ప్రసంగాలకు మాత్రం స్పందన చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి.

ఇలాంటివేళ.. రిషి తన గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యారు. బ్రిటన్ ప్రజలతో పాటు తన కుటుంబం గురించి మాట్లాడిన ఆయన భావోద్వేగానికి పెద్దపీట వేశారు. ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన తల్లిదండ్రులకు.. భార్య అక్షతా మూర్తికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోకి కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

- ఈ ప్రసంగ వేదిక నాకెంతో ప్రత్యేకం. ప్రజా సేవలోకి రావడానికి ప్రేరేపించిన నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. విలువలు, కఠోర శ్రమ నాకు నేర్పించి.. నాలో నమ్మకాన్ని నింపినందుకు అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. వారిచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా.

- మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా (తల్లిదండ్రుల్ని ఉద్దేశించి)

- కృషి, నమ్మకం మీ ప్రేమతో మన గొప్ప దేశంలో ఎవరైనా ఏమైనా సాధించాలని అనుకునే వారికి ఎలాంటి పరిమితి లేదన్న విషయాన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు.

- పద్దెనిమిదేళ్ల క్రితం హైహీల్స్ ను వదిలేసి.. భుజాన తగిలించుకునే బ్యాగుతో పొట్టి కుర్రాడిని ఎంచుకున్నందుకు థ్యాంక్స్ అంటూ తన భార్య అక్షతా మూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తన లాంటి సాధారణ కుర్రాడిని అంగీకరించటాన్ని ఆయన ప్రస్తావించారు.

- చర్చలో భాగంగా పలువురు టోరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ప్రధానిగా పోటీ చేస్తున్న క్రమంలో మీరు ఏం త్యాగం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. ‘గడిచిన రెండేళ్లలో ఒక భర్తగా.. ఒక తండ్రిగా వారికి తగినంత సమయాన్ని కేటాయించలేకపోయా.

- ఇదేమైనా కష్టమైన విషయమా? అని అనిపించొచ్చు. నా వరకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే.. నేను నా భార్య పిల్లలకు ఎక్కువ ప్రేమను పంచలేకపోయాను. బ్యాడ్ లక్ ఏమంటే.. కొన్ని సంవత్సరాలుగా నేను వాళ్ల జీవితాల్లో నేను ఇష్టపడేంతగా ఉండలేకపోయా.

- నేను ప్రజలు వినాలనుకునే విషయాల్ని చెప్పట్లేదు. మన దేశం వినాలని నేను నమ్ముతున్న విషయాలు చెప్పాను.

- ఈ ఘనమైన దేశంలో సాధించలేనిదంటూ ఏదీ లేదన్న రిషి.. బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరగడం, నేరాలు, పన్నులు పైకి ఎగబాకడం, వలస విధానంలో సంస్కరణలు, విదేశాంగ విధానం తదితరాలపై తన ప్రాధాన్యతల్ని తెలియజేశారు.

రిషి భావోద్వేగ ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని పక్కన పెడితే.. ప్రచార కార్యక్రమంలో మాత్రం ఆయన తన మార్కును బ్రిటన్ ప్రజల మీద స్పష్టంగా వేయగలిగారు. ఇదిలా ఉంటే.. బుధవారం రాత్రి జరిగిన ప్రచారంతో ఎన్నికల ప్రచారం ముగిసినట్లైంది. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధానిని ఎన్నుకునే పోలింగ్ సెప్టెంబరు 5న జరగనుంది.

పోటీ పడుతున్న రిషి సునాక్.. లిజ్ ట్రస్ ల మధ్య నెలకొన్న పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది 1.75 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ తో తేలనుంది. శుక్రవారం సాయంత్రం వరకు సాగే పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపును మాత్రం సోమవారం వెల్లడిస్తారు. ఇప్పటివరకు వచ్చిన సర్వే ఫలితాల్ని చూస్తే.. రిషితో పోలిస్తే ఆయన ప్రత్యర్థి ట్రస్ ముందంజలో ఉన్నారు. ఎన్నికల్లో విజేతను ఎలిజబెత్ రాణి ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆమె లండన్ లోని బకింగ్ హోమ్ ప్యాలెస్ లో కాకుండా స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోటలో ఉన్నారు. అక్కడి నుంచి ఆమె విజేత ఎవరన్నది ప్రకటిస్తారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.