Begin typing your search above and press return to search.

గాంధీ ఫ్యామిలీని రిషీక‌పూర్ అలా అనేశారంతే

By:  Tupaki Desk   |   18 May 2016 10:15 AM GMT
గాంధీ ఫ్యామిలీని రిషీక‌పూర్ అలా అనేశారంతే
X
ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌టం లేదన్న మాట తాజాగా బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషిక‌పూర్ మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. సోష‌ల్ మీడియా తీసుకొచ్చిన భావ‌స్వేచ్ఛ‌తో కొంద‌రు సెల‌బ్రిటీలు చెల‌రేగిపోతున్న వైనం ఈ మ‌ధ్య‌న గుర్తించొచ్చు. తాము చేసిన వ్యాఖ్య‌లు నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌ట‌మేకాదు.. తాము ప్ర‌స్తావించిన అంశాల్లో విష‌యం ఉంటే.. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్దుతు ఉండ‌టం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేందుకు కార‌ణంగా మారింద‌ని చెప్పాలి. గ‌తంలో ఆచితూచి మాట్లాడ‌టం.. రాజ‌కీయ అంశాల మీద స్పందించేందుకు ఇష్ట‌ప‌డ‌ని వైనం నుంచి నేరుగా విమ‌ర్శ‌లు చేసేందుకు సైతం వెనుకాడ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది.

ఢిల్లీలోని అక్బ‌ర్ రోడ్డును మ‌హారాణా ప్ర‌తాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్ర‌మంత్రి వీకే సింగ్ చేసిన ప్ర‌తిపాద‌న‌పై ఆయ‌న ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ హ‌యాంలో వివిధ రోడ్ల‌కు.. క‌ట్ట‌డాల‌కు గాంధీ ఫ్యామిలీ స‌భ్యుల పేర్లు పెట్టార‌ని.. వాటిని మార్చుకోవ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు.

వివిధ ఆస్తుల‌కు ఉన్న గాంధీ కుటుంబ‌స‌భ్యుల పేర్ల‌ను మార్చండి.. బాంద్రా వ‌ర్లీ సీలింక్ రోడ్డుకు ల‌తా మంగేష్క‌ర్ లేదా జేఆర్డీ టాటా పేరు పెట్టండి అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

చండీగ‌ఢ్ లో రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? దేశానికి.. స‌మాజానికి సేవ చేసిన వారి పేర్లు పెట్టొచ్చు కానీ.. ప్ర‌తిదానికీ గాంధీ.. నెహ్రు కుటుంబ స‌భ్యుల పేర్లు ఎందుకు? అని నిల‌దీసిన ఆయ‌న‌.. ఢిల్లీ విమానాశ్ర‌యానికి ఇందిరాగాంధీ పేరు పెట్ట‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి మ‌హాత్మ గాంధీ పేరు కానీ.. భ‌గ‌త్ సింగ్.. అంబేడ్క‌ర్ పేర్ల‌లో ఏదో ఒక‌టి పేరు పెట్టాల‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. త‌న తండ్రి రాజ్ క‌పూర్‌.. రాజ‌కీయ నాయ‌కుల కంటే దేశానికి చాలానే చేశార‌ని వ్యాఖ్యానించ‌టం విశేషం. ఇంత‌కీ.. రిషిక‌పూర్ కోప‌మంతా గాంధీ ఫ్యామిలీ మీదా లేక త‌న తండ్రి రాజ్ క‌పూర్ ని ప‌ట్టించుకోలేద‌నా?