Begin typing your search above and press return to search.

రిషి సునాక్‌.. భార‌త్ వ‌చ్చేయాలి.. నెటిజ‌న్ల పిలుపు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   23 July 2022 2:30 AM GMT
రిషి సునాక్‌.. భార‌త్ వ‌చ్చేయాలి.. నెటిజ‌న్ల పిలుపు.. రీజ‌నేంటి?
X
రిషి సునాక్‌.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు కూడా ఈయ‌న ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌దు. తెలిసినా.. ఆయ‌న ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ‌మూర్తి అల్లుడ‌ని.. బ్రిట‌న్ లో ప్ర‌జాప్ర‌తినిధి అని.. అంత‌వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు. అంత‌కు మించి ఎవ‌రూ పెద్ద‌గా ఆయ‌న గురించి ప‌ట్టించుకోలేదు కూడా! అయితే.. ప‌ట్టుమ‌ని రెండు మాసాలు తిరిగే స‌రికి.. రిషి సునాక్ భార‌త్‌లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి రేసులో చాలా స్పీడుగా దూసుకుపోతున్నారు.

అయితే.. భార‌త్‌లో ప్ర‌జ‌లు ముఖ్యంగా నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. `రిషి స‌ర్‌.. భార‌త్‌కు వ‌చ్చేయండి..మేం మిమ్మ‌ల్ని ప్ర‌ధానిని చేస్తాం`` అని కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు.. ``మీరు భార‌త్‌కు వ‌స్తే.. మేం మీ వెంటే ఉంటాం.. మీకు మ‌ద్ద‌తుగా నిలుస్తాం`` అని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ టాపిక్ చ‌ర్చ‌కు దారితీస్తోంది. అస‌లు.. ఇంత‌గా రిషి హాట్ టాపిక్ అవ‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది చూస్తే.. బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో ఉన్న రిషి.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న వాగ్దానం ఒక‌టి చేశారు. ఇది మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

అదేంటంటే.. ప్ర‌స్తుతం మ‌న దేశానికి మ‌ల్లే.. బ్రిట‌న్ కూడా ద్ర‌వ్యోల్బ‌ణంతో అల్లాడుతోంది. ప్ర‌జ‌లు ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటు న్నారు. క‌రోనా కార‌ణంగా.. మ‌న ద‌గ్గ‌ర ఎలా అయితే.. ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయో.. బ్రిట‌న్‌లోనూ అలానే స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో అక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న బోరిస్ జాన్స‌న్‌.. ధ‌ర‌ల‌ను పెంచేశారు. ఫ‌లితంగా చిన్న బిస్క‌ట్ ప్యాకెట్ కూడా ధ‌ర పెరిగి.. పోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రిషి ఆస‌క్తిక‌ర వాగ్దానం చేశారు. తాను ప్ర‌ధాని అయితే.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు.

స‌హ‌జంగా ఏ నాయ‌కుడైనా ఇలాంటి వాగ్దానాలు చేస్తారు. అయితే.. అంత‌కుమించి.. అన్న‌ట్టుగా రిషి దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ద్ర‌వ్యోల్బణానికి కార‌ణ‌మైన ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ముకుతాడు వేస్తాన‌ని.. ప్ర‌జ‌ల‌పై ధ‌రాభారాల‌ను, ముఖ్యంగా ప‌న్నుల‌ను త‌గ్గించేస్తాన‌ని వాగ్దానం చేశారు. ఇది బ్రిట‌న్ పౌరుల‌కు భారీ ఉప‌శ‌మ‌నంగా మారింది.

ఈక్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాని రేసులో దూసుకుపోతున్నాడ‌నేది ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని గ‌మ‌నించిన భార‌త్‌లోని యువ‌త‌.. రిషిని ఈ దేశానికి ఆహ్వానిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఏది ముట్టుకున్నా.. ప‌న్నుల వ‌డ్డింపు మామూలుగా లేదు.

ద్ర‌వ్యోల్బ‌ణం పేరుతో ఆర్బీఐ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను బాదేస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ప‌న్నుల‌ను తాళ‌లేక పోతున్న ప్ర‌జ‌లు.. రిషి సునాక్ వంటి పాల‌కుడు త‌మ‌కు కూడా కావాల‌ని కోరుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగా ప్ర‌జ‌లు కోరుకున్నా రిషి భార‌త్‌కు రాలేడు. వ‌చ్చినా.. ఇక్క‌డి చ‌ట్టాలు ఆయ‌న‌ను పోటీ చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకూ అనుమింత‌చ‌వ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.