Begin typing your search above and press return to search.
కొత్త వివాదానికి తెర తీసిన నారాయణ మూర్తి అల్లుడి దాపరికం
By: Tupaki Desk | 1 Dec 2020 1:30 AM GMTఅరుదైన అవకాశాలు అందరికి లభించవు. అన్ని అర్హతలు ఉన్నా కీలక పదవులు చాలామందికి దక్కవు. కాస్తంత కాలం కలిసి వచ్చినప్పుడు అలాంటివి సొంతమవుతాయి. ఆ కోవలోకే వస్తుంది ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ వ్యవహారం. 39 ఏళ్ల ఆయన ఏకంగా బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఎన్నిక కావటం తెలిసిందే. వందల ఏళ్లు ఏ దేశాన్నైతే తెల్లోడు పాలించాడో.. ఆ దేశానికి విత్త మంత్రిగా అవకాశం లభించటం సామాన్యమైన విషయం కాదు.
మంత్రివర్గంలోని వారు తమ ఆర్థిక విషయాల్ని ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. మంత్రులు తమ కుటుంబం అధీనంలో ఉన్న ఆస్తుల గురించి వెల్లడించాలి. మినిస్టీరియల్ రిజిస్టర్ ప్రకారం తమ తోబుట్టువులు.. తల్లిదండ్రులు.. భార్య.. అత్తమామల పేర్ల మీద ఉన్న అన్ని ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి. నారాయణ మూర్తి అల్లుడు రిషి మాత్రం.. కేవలం తనకు సంబంధించిన వివరాల్ని మాత్రమే వెల్లడించారు. యూకే ఆధారిత వెంచర్ క్యాపిటల్ కంపెనీకి తాను యజమానిని మాత్రమేనని పేర్కొన్నారు. అంతేకానీ.. తన భార్య ఆస్తులు.. అత్తమామల ఆస్తుల వివరాల్ని వెల్లడించలేదు.
గార్డియన్ ప్రచురించిన కథనం ప్రకారం రిషి భార్య అక్షత మూర్తి.. అదేనండి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె కు ఆ కంపెనీలో 430 మిలియన్ పౌండ్లు విలువ చేసే షేర్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే.. బ్రిటన్ లో అత్యంత సంపన్న మహిళగా ఆమె నిలుస్తారు. మరి ముఖ్యంగా క్వీన్ ఎలిజబెత్ కంటే ఆమె ధనవంతురాలు. అయితే.. రిషి తన భార్య మీద ఉన్న ఆస్తి వివరాల్ని వెల్లడించకుండా ఉండటంతో.. అతడి ఆర్తిక వ్యవహారాల పారదర్శకత మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.