Begin typing your search above and press return to search.

భారత్ లో ఎందరో రిషి సునాకులు ....మరి ప్రధాని ఛాన్స్ .?

By:  Tupaki Desk   |   25 Oct 2022 11:45 AM GMT
భారత్ లో ఎందరో రిషి సునాకులు ....మరి ప్రధాని ఛాన్స్ .?
X
భారత్ లాంటి దేశాన్ని చెరబట్టి ఏకంగా రెండు వందల ఏళ్ళ పాటు పాలించిన బ్రిటన్ కి ఇపుడు అదే భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఇది నిజంగా ఒక అద్భుతం. అదే టైం లో భారత్ లో చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే దీని నుంచి కూడా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నం చేసే వారున్నారు. రచ్చకు రెడీ అవుతున్న వారున్నారు. ముందుగా చూసే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఒక మైనారిటీని బ్రిటన్ వంటి దేశం తమ ప్రధానిగా ఎన్నుకుందని, అదే భారత్ లో ఒక మైనారిటీకి ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని సూటి ప్రశ్నను బీజేపీకి సంధించారు.

దీంతో మొదలైంది రచ్చ. తృణమూల్ కాంగ్రెస్ తో పాటు పీడీపీ వంటి పార్టీలు అదే ప్రశ్నను వేశాయి. ఈ దేశంలో ఒక ముస్లిం కానీ సిక్కు, ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారు ప్రధానిగా అయ్యే అవకాశాలు ఉన్నాయా అని విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. దాంతో బీజేపీ కూడా ధీటుగా రియాక్ట్ అవుతోంది.

ముందు కాశ్మీర్ లో మైనారిటీ హిందువుని సీఎం గా చేయండి అని పీడీపీకి బీజేపీ ఘాటు రిప్లై ఇచ్చింది. అలాగే పంజాబ్ లో కూడా మైనారిటీని ప్రధానిగా చేసి అపుడు మాట్లాడాలని కాంగ్రెస్ కి కూడా సూచించింది. ఇక మైనారిటీ ప్రధాని ఈ దేశానికి కావాలని డిమాండ్ చేస్తున్న మమతా బెనర్జీకి బీజేపీ నేత అమిత్ మాళవీయ కౌంటర్ ఇచ్చారు. ముందు మమత గద్దె దిగి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని తన పార్టీకే చెందిన ఫిర్హద్ హకీమ్ ను సీఎం గా చేయవచ్చు కదా అని సూచించారు.

ఇక దీని మీద సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్టూ అయితే ఘాటుగా స్పందించారు. రిషి సునాక్ విషయంలో మైనారిటీయా చైనాకు చెందిన వాడా, భారతీయుడా అన్నది పక్కన పెట్టాలని అన్నారు. అంతే కాదు, ఆయన బ్రిటన్ ని ఆర్ధికంగా ఎలా గాడిలో పెడతారో చూడాలని అన్నారు. ఈ సమయంలో భారత్ లో మైనారిటీ ప్రధాని అని డిమాండ్ చేయడం సరి అయినది కాదని కట్టూ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా బ్రిటన్ తన ఉదారవాదాన్ని చాటుకుని ఒక హిందువు, మైనారిటీ అయిన భారత సంతతి వారు అయిన రిషికి ప్రధాని పీఠం అప్పగించింది. ఈ విషయంలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా తమ దేశం భవిష్యత్తు కోసం ఆలోచించారు. దాంతో మిగిలిన విషయాలు అన్నింటినీ పక్కనపెట్టారు. అలా అక్కడ మైనారిటీ వర్గంగా ఉన్న మాజీ ఆర్ధిక మంత్రి రిషీ సునాక్ ప్రధాని అయ్యే చాన్స్ దక్కించుకున్నారు.

అయితే ఇది భారత్ లోసాధ్యమా అంటే భారత్ సంప్రదాయ దేశం. పైగా ఇక్కడ కులం, మతం పునాదులు బలంగా ఉన్నాయి. అంతే కాదు, భారత్ లో ఒక విభజన మత ప్రాతిపదికన జరిగింది. ఇది చరిత్రలో చేదు నిజంగా ఉంది. మరో వైపు కాశ్మీర్ వివాదం మత ప్రాతిపదికగానే సాగుతోంది. ఇంకో వైపు ఉగ్ర ముప్పు కూడా మతం ఆధారంగానే జరుగుతోంది అన్న ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. దాంతో భారత్ లాంటి దేశంలో ఇప్పట్లో ఒక మైనారిటీ ప్రధాని పీఠం అధిరోహిస్తారా అన్నది చెప్పలేరు.

అయితే రాను రాను పరిస్థితులు మారతాయి. భారత్ లోపలా బయట కూడా పరిస్థితుల్లో మార్పులు వచ్చిన తరువాత ఇలాంటి వాటి మీద ఆలోచన చేయవచ్చు అని మేధావులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ దేశంలో ఒకనాడు అగ్రవర్ణాల వారే ఉన్నత పదవులలో ఉన్నారు. ఇపుడు మిగిలిన వారు కూడా అవకాశాలు అందుకుంటున్నారు. అందువల్ల ఈ రోజుకి ఈ రోజు జరగడం కష్టమేమో కానీ ఏదో నాడు భారత్ లో కూడా మార్పులు వచ్చినా రావచ్చు అంటున్నారు. దానికి ముందు మతాలతో రాజకీయాలు చేయడాన్ని, కులాల కుమ్ములాటకు రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలి అని సూచిస్తున్నారు.