Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న 31 టెన్షన్

By:  Tupaki Desk   |   29 Aug 2021 10:30 AM GMT
పెరిగిపోతున్న 31 టెన్షన్
X
ఆఫ్ఘన్లతో పాటు ప్రపంచదేశాల్లో 31 టెన్షన్ పెరిగిపోతోంది. అమెరికా, మిత్రదేశాల సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ను వదిలి వెళ్ళటానికి ఈనెల 31వ తేదీ డెడ్ లైన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడో ఆప్ఘన్ ప్రభుత్వానికి అమెరికా, మిత్రదేశాలకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయాదేశాలు తమ సైన్యాలను దేశంలో నుండి ఉపసంహరించుకుంటున్నాయి. ఈ కారణంగానే తాలిబన్ల ఒక్కసారిగా విజృంభించి ఆప్ఘన్లో అధికారాన్ని ఆక్రమించేసుకున్నారు.

ఎలాగూ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అన్న ఉదాసీనతతో అమెరికా, మిత్రదేశాలు తాలిబన్ల అరాచకాలను చోద్యంచూస్తు కూర్చున్నారు. పౌర ప్రభుత్వాన్ని కూలదోసి ఆఫ్ఘన్ అధికారాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవటానికి అమెరికా, మిత్రదేశాలు వాటి అంతర్గత వ్యవహారంగా వదిలేశాయి. అందుకనే తీవ్రవాదులు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా విదేశీ సైన్యాలు ఏమాత్రం పట్టించుకోలేదు.

తమకు ఎదురుతిరుగుతున్నవాళ్ళని తాలిబన్లు కాల్చి చంపేస్తున్నారు. ఇళ్ళల్లోకి దూరిమరీ తమకు నచ్చిన ఆడవాళ్ళను కిడ్నాప్ చేసి ఎత్తికెళ్ళిపోతున్నారు. ప్రజల ఆస్తులను కబ్జా చేసేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఆఫ్ఘన్ జనాలు ఎలాగైనా తమ దేశంనుండి వెళ్లిపోయేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, మిత్రదేశాల సైన్యాలు ఉండగానే తాలిబన్ల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. అలాంటిది ఈ సైన్యాలన్నీ తమ దేశాన్ని ఖాళీ చేసేస్తే తమ బతుకులు ఎలాగుంటాయో అనే టెన్షన్ ఆప్ఘన్ జనాల్లో పెరిగిపోతోంది.

వివిధ దేశాల సైన్యాలు ఆఫ్ఘన్ను వదిలి వెళ్ళటానికి గడువు ఇక రెండురోజులే ఉంది. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, భారత్, పోలెండ్, కెనడా, బెల్జియం, జపాన్ లాంటి చాలా దేశాలు రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో పాటు తమ పౌరులను కూడా తరలించేశాయి. 31 నాటికి మిగిలిన అరాకొర విదేశీ సైన్యం కూడా వెళిపోతే ఆప్ఘన్ల ప్రాణాలు గాల్లోదీపాలే అనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. అందుకనే విదేశీ సైన్యాలను తమ దేశంవదిలి వెళ్ళొద్దంటు ఆప్ఘన్ జనాలు ప్రాదేయపడుతున్నారు.

ఒకవైపు ఇలాంటి విజ్ఞప్తులు పెరుగుతున్న నేపధ్యంలోనే కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర మానవబాంబు సంచలనంగా మారింది. ఈ పేలుడులో సుమారు 110 మంది మరణించటంతో అమెరికా మండిపోతోంది. కారణం ఏమిటంటే మరణించిన వారిలో 14 మంది అమెరికా సైనికులు కూడా ఉండటమే. ఈ కారణంగానే ఆప్ఘన్లో తమపై దాడిచేసిన మానవబాంబులను వెంటాడటానికి అమెరికా దాడులు మొదలుపెట్టింది. మరి తాజా పరిణామాల మధ్య 31 డెడ్ లైన్ విషయంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.