Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   6 Feb 2022 7:33 AM GMT
కాంగ్రెస్ లో పెరిగిపోతున్న టెన్షన్
X
పంజాబ్ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఈరోజు అంటే ఆదివారం నాడు పంజాబ్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రకటించబోతున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి ఎవరో ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. సిద్ధూ ఎందుకు ఇంతగా పట్టుబట్టారంటే తననే సీఎం అభ్యర్ధిగా అధిష్టానం ప్రకటించాలని కోరుకుంటున్నారు కాబట్టే.

అయితే అధిష్టానం ఆలోచన మాత్రం మరోరకంగా ఉంది. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఎందుకంటే చన్నీ సీఎంగా బాధ్యతలు తీసుకుంది ఈమధ్యనే. పైగా పంజాబ్ కు ముఖ్యమంత్రయిన మొట్టమొదటి దళిత నే చన్నీయే. పంజాబ్ లో దళితులు సుమారు 31 శాతం ఉన్నారు. ఇదే సమయంలో చన్నీపై ఎలాంటి ఆరోపణలులేవు. మరంతమంది దళితులకు ప్రతినిధిగా ఉన్న చన్నీని కాదని అధిష్టానం ఇంకొకరిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం లేదు.

చన్నీని సీఎంగా ఎంపికచేయటంలో అధిష్టానం వ్యూహం కూడా దళితులను ఆకర్షించటమే. కాబట్టి సిద్ధూని ఎట్టి పరిస్దితుల్లోను సీఎం అభ్యర్ధిగా ప్రకటించదు. కానీ సిద్ధూ ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయి. తనవల్లే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే భ్రమల్లో సిద్ధూ ఉన్నారు. అందుకనే ఇటు చన్నీతోను అటు అధిష్టానంతోను తరచు గొడవలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి పంజాబ్ లో పర్యటిస్తున్నారు.

తన పర్యటనలో భాగంగా 6వ తేదీన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తామని రాహుల్ గతంలోనే ప్రకటించారు. అంటే కాంగ్రెస్ అభ్యర్ధిని ఈరోజు ప్రకటించబోతున్నారు. అందుకనే కాంగ్రెస్ నేతలందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. అధిష్టానం చన్నీనే అభ్యర్ధిగా ప్రకటిస్తే సిద్ధూ ఏ విధంగా రియాక్టవుతారో అర్ధంకావటంలేదు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించిన తర్వాత తానే సీఎం అయిపోయినట్లు సిద్ధు అనుకున్నారు. అయితే అధిష్టానం అనూహ్యంగా చన్నీని ప్రకటించేసరికి సిద్ధూ ఎంత కంపు చేశారో అందరికీ తెలిసిందే. అందుకనే ఇపుడు ఏమి చేస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి రాహుల్ ఎవరిని ప్రకటిస్తారో చూడాలి.