Begin typing your search above and press return to search.

బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   22 Jan 2022 9:30 AM GMT
బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్
X
ఉత్తరప్రదేశ్ లో మొదటి విడత ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ కు కారణం ఏమిటంటే ఓబీసీ వర్గాలే అని చెప్పాలి. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న బలమైన నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య హఠాత్తుగా బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిపోయారు. వెళుతూ వెళుతూ తనతో పాటు మరో ఐదుగురు ఓబీసీ నేతలను కూడా తీసుకెళ్లిపోయారు. దాంతో అధికారపార్టీలో బలమైన ఓబీసీ నేత లేకపోవడం లోటుగా మారింది.

అందుకనే ఇప్పటికిప్పుడు అత్యవసరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యను పార్టీ నెత్తిన పెట్టుకుంటోంది. యూపీలో 45 శాతం ఓబీసీ జనాభా ఉన్నారు. వీరిలో కేశవ్ కూడా బలమైన నేతనే చెప్పాలి. ఈ 45 శాతం ఓబీసీల్లో బలమైన ఉపకులమంటే యాదవులే. యాదవేతర కులాల్లో స్వామి ప్రసాద్ మౌర్య లాగే కేశవ్ కూడా బలమైన నేతే. కాకపోతే తనకు అడ్డుగా వస్తారన్న అనుమానంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ తొక్కి పట్టేశారు.

కేశవ్ కూడా సౌమ్యుడు కాబట్టే రాజకీయంగా పార్టీలో ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేదు. ఇదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్యకు బీజేపీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నా పట్టించుకోలేదు. అలాంటిది తాజా రాజకీయ సమీకరణల్లో హఠాత్తుగా ఇపుడు కేశవ్ ను పార్టీ నెత్తిన పెట్టుకుంటోంది. కారణం ఏమిటంటే యాదవేతర ఓబీసీల ఓట్లకోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓబీసీల ఓట్ల కోసమే ఇపుడు కేశవ్ ను పార్టీ తెరమీదకు తీసుకొచ్చి ప్రచారంలో తిప్పుతోంది.

మరి చివరి నిముషంలో కేశవ్ ను నెత్తిన పెట్టుకోవటం వల్ల బీజేపీకి ఎంత లాభముంటుందో తెలీదు. ఫిబ్రవరి 10వ తేదీన జరగబోతున్న మొదటి విడత పోలింగ్ కు సంబంధించి విడుదల చేసిన మొదటి విడత జాబితాలో ఓబీసీలకే బీజేపీ పెద్దపీట వేసింది. అయితే ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య అండ్ కో బీజేపీలోని మార్పులను గమనిస్తునే ఉన్నారు. అందుకనే ఎస్పీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో ఓబీసీలుండేట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో గట్టెక్కే విషయంలో బీజేపీలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది.